చావులోనూ వీడని బంధం

18 Sep, 2022 02:40 IST|Sakshi
శివ్వమ్మ, బాషయ్య 

అప్పులబాధతో దంపతుల ఆత్మహత్య

కౌడిపల్లి(నర్సాపూర్‌): చావులోనూ బంధాన్ని వీడకుండా భార్యాభర్తలిద్దరూ ఒకేతాడుతో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పంటలసాగులో వచ్చిన నష్టం ఆ దంపతుల ప్రాణాలను మింగేసింది. ఈ ఘటన శనివారం మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం ముట్రాజ్‌పల్లిలో చోటుచేసుకుంది. ముట్రాజ్‌పల్లికి చెందిన ఆకుల బాషయ్య(57), శివ్వమ్మ(53) భార్యాభర్తలు. వీరికి కొడుకు నరేశ్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి.

నరేశ్‌ ఏడాదిగా హైదరాబాద్‌లో ఉంటూ ఫొటో స్టూడియోలో పనిచేస్తున్నాడు. బాషయ్య, శివ్వమ్మ గ్రామంలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. పిల్లల పెళ్లిళ్లు, సాగు కోసం చేసిన రూ.4 లక్షల అప్పులు, ఇటీవల వేసిన బోరు ఫెయిల్‌ కావడం, పంటలో నష్టం రావడం.. వీటికితోడు భార్య అనారోగ్య పరిస్థితి ఆయనను ఆందోళనకు గురిచేశాయి. అప్పులు తీర్చే మార్గం కానరాక తరచూ మథనపడేవాడు.

ఈ క్రమంలో శుక్రవారంరాత్రి పదిగంటల వరకు ఆ దంపతులు ఇరుగుపొరుగు వారితో ముచ్చట పెట్టి అనంతరం ఇంట్లోకి వెళ్లిపోయారు. శనివారం ఉదయం గ్రామానికి చెందిన మంగమ్మ బట్టలు ఉతికేందుకని బాషయ్య ఇంటికి వెళ్లి తలుపుతట్టగా లోపలి నుంచి ఉలుకూపలుకూలేదు. దీంతో ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా దంపతులిద్దరూ ఒకేతాడుతో దూలానికి ఉరేసుకుని మృతిచెందారు.  కొడుకు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు