కలిసి బతకలేం.. ఒక్కటిగా చనిపోదాం 

22 Mar, 2022 03:31 IST|Sakshi
కాల్వలో కొట్టుకుపోతున్న  యువతిని రక్షిస్తున్న స్థానికులు, వడ్త్యా బాలకృష్ణ

సాగర్‌ ఎడమ కాల్వలో దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం 

ప్రియుడు గల్లంతు.. ప్రియురాలిని రక్షించిన స్థానికులు 

నల్లగొండ జిల్లా హాలియాలో విషాదం 

హాలియా: పెళ్లికి పెద్దలు అంగీకరించరని ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కలిసి బతకలేమని.. ఒక్కటిగానైనా చనిపోదామని నిర్ణయించుకొని ప్రేమికులిద్దరూ నాగర్జునసాగర్‌ ఎడమ కాల్వలో దూకారు. ప్రియురాలిని స్థానికులు రక్షించగా.. అప్పటికే నీటి ప్రవాహంలో యువకుడు గల్లంతయ్యాడు. నల్లగొండ జిల్లా హాలియాలో సోమవారం ఈ విషాదం జరిగింది.  

పెద్దలు అంగీకరించరని భావించి..  
నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం నర్లంగ తండాకు చెందిన రమావత్‌ లింగ, కవిత దంపతుల కుమార్తె నందిని (18) దేవరకొండలో ఇంటర్‌ చదువుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా మాచర్ల మండలం రేగులవరం తండాకు చెందిన వడ్త్యా బాలకృష్ణ (21) ఒంగోలులోని ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. బాలకృష్ణ సోదరుడు వడ్త్యా బాబురావుతో నందిని అక్క రమా వత్‌ అనితకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.

ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరి వివాహ సమయంలో బాలకృష్ణ, నందిని మధ్య ఏర్పడిచన పరిచయం ప్రేమగా మారింది. 9 నెలల క్రితం బాబురావు భార్య అనిత ఆత్మహత్య చేసుకుంది. పిల్లలు తల్లిలేనివారయ్యారు. అక్క పిల్లల కోసం బావను పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు నందినిపై ఒత్తిడి తెచ్చారు. అయితే నందిని, బాలకృష్ణ తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించారు. ఆదివారం ఫోన్‌లో మాట్లాడుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.  

తాళ్ల సాయంతో యువతిని కాపాడి.. 
సోమవారం ఉదయం 10 గంటలకు ప్రేమ జంట హాలియాకు చేరుకుంది. ఎడమ కాల్వలోకి ముందుగా ప్రియుడు బాలకృష్ణ దూకగా ఆ తర్వాత ప్రియురాలు దూకింది. విషయం గమనించిన హోంగార్డు వెంకట్‌.. వెంటనే ఎస్‌ఐ క్రాంతికుమార్‌కి సమాచారం అందించాడు. ఆయన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న యువతిని స్థానిక యువకుల సాయంతో తాళ్లతో కాపాడారు. అప్పటికే బాలకృష్ణ కనిపించకుండాపోయాడు. పోలీసులు గాలించినా బాలకృష్ణ ఆచూకీ లభించలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు