కోర్టును ఆశ్రయించిన ప్ర‌జ్ఞారెడ్డి.. పుల్లారెడ్డి కొడుకు, మనవడికి నోటీసులు జారీ

26 May, 2022 07:36 IST|Sakshi

దేశవ్యాప్తంగా ప్ర‌ఖ్యాతి గాంచిన పుల్లారెడ్డి స్వీట్స్‌ అధినేత జి. పుల్లారెడ్డి కుటుంబ వివాదం చివరకు కోర్టుకు చేరింది. పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్‌ రెడ్డిపై ఆయన భార్య ప్ర‌జ్ఞారెడ్డి పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో గృహ హింస చట్టం కేసు పెట్టిన విషయం తెలిసిందే. 

కాగా, ప్ర‌జ్ఞారెడ్డి బుధవారం హైద‌రాబాద్ మొబైల్ కోర్టును ఆశ్ర‌యించారు. త‌న‌ను ఇంట్లోనే నిర్బంధించి వేధింపులకు గురిచేశారని ప్ర‌జ్ఞారెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఇంటిలో త‌న‌ను ఎలాంటి హింస‌కు గురి చేస్తున్నార‌న్న వైనాన్ని తెలిపే ఫొటో కాపీలను ఆమె కోర్టులో సమర్పించారు. దీంతో, ఆమె పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాధితురాలు ప్ర‌జ్ఞారెడ్డికి భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని పంజాగుట్ట పోలీసుల‌ను ఆదేశించింది. అనంతరం త‌దుప‌రి విచార‌ణ‌ను వ‌చ్చే నెల 9కి వాయిదా వేసింది. 

అనంతరం, పుల్లారెడ్డి కొడుకు రాఘ‌వరెడ్డితో పాటు ఆయ‌న భార్య, కుమారుడు ఏక్‌నాథ్‌ రెడ్డికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే, గత కొంతకాలంగా ఏక్‌నాథ్ రెడ్డి ఆయన భార్య ప్రజ్ఞా రెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ రోజు ఏక్‌నాథ్‌ రెడ్డి.. భార్యను ఇంట్లో నుంచి బయటకు రాకుండా రాత్రికి రాత్రే ఆమె ఉంటున్న గదికి అడ్డుగా గోడను నిర్మించి అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన అనంతరం ప్రజ్ఞా రెడ్డి.. పోలీసులు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. 

ఇది కూడా చదవండి: టీవీ నటి, టిక్‌టాక్‌ స్టార్‌ కన్నుమూత

మరిన్ని వార్తలు