Juscti For Manikandan: సంచలన ఆదేశం.. రీపోస్ట్‌ మార్టం చేయాల్సిందే!

8 Dec, 2021 12:31 IST|Sakshi

Juscti For Manikandan: పోలీసు కస్టోడియల్‌ మరణాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. 21ఏళ్ల విద్యార్థి ఎల్ మణికందన్ పోలీసు కస్టడీ నుంచి విడుదలైన మరుసటిరోజే మృతి చెందటం కలకలం రేపుతోంది. తన కుమారుడిది పోలీసు కస్టోడియల్‌ మరణమం​టూ అతని తల్లి కోర్టును ఆశ్రయించింది. మంగళవారం మద్రాసు హైకోర్టు మధురై బెంచ్‌ మణికందన్‌ మృతదేహానికి తిరిగి పోస్ట్‌ మార్టం చేయాలని ఆదేశించింది.

వివరాలు.. ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఎల్‌ మణికందన్‌ తన స్నేహితుడితో బైక్‌ మీద వెళుతుండగా.. పరమకుడి-కీజాతొరోవల్ రోడ్డులో వెహికల్‌ చెకప్‌ చేస్తున్న పోలీసులు ఆపారు. అయితే వారి నుంచి తప్పించుకోవడానికి మణికందన్‌, అతని స్నేహితుడు ప్రయత్నించారు. కానీ, పోలీసులు వారిని పట్టుకొగా అతని స్నేహితుడు భయంతో పారిపోయాడు. దీంతో పోలీసులు మణికందన్‌ను స్టేషన్‌కు తరలించారు.

అనంతరం అతని తల్లి రామలక్ష్మీకి  సమాచారం అందించగా.. మణికందన్‌ను తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌ వచ్చి ఇంటికి తీసుకువెళ్లారు. అయితే మరుసటి రోజు ఉదయం మణికందన్‌ సృ‍హలో లేకపోవడం గమనించిన తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మణికందన్‌ మృతిచెందాడు. మణికందన్‌కు పోస్ట్‌ మార్టం చేయించిన పోలీసులు.. తల్లిందండ్రులకు అప్పగించారు. అయితే తమ కొడుకు పోలీసులే స్టేషన్‌లో హింసించడం వల్ల మారణించాడని తల్లిదం‍డ్రులు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరుపుతామని  పోలీసు అధికారలు చెప్పడంతో నిరసన విరమించారు.

సోమవారం పోలీసులు పోలీసు స్టేషన్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు. అతని శరీరానికి ఎటువంటి గాయం లేదని, పోలీసులు హింసించలేదని పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. వాహన తనిఖీల్లో భాగంగా అడ్డుకున్నామని, అతని(మణికందన్‌) స్నేహితుడు గంజాయి కేసుల్లో ఉ‍న్నాడని తెలిపారు. పోలీసులు హింసించారని దానికారణంగా మణికందన్‌ తల్లిదండ్రులు కోర్టును అశ్రయించారు.

పోలీసులు చాలా తక్కువ నిడివి ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ మాత్రమే విడుదల చేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో మణికందన్‌ మృతదేహానికి రీపోస్ట్‌ మార్టం చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే మణికందన్‌ ఘటనపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. పోలీసు దౌర్జన్యం, కస్టోడియల్‌ మరణాలకు వ్యతిరేకంగా ‘జై భీం’ మూవీ విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు