విషాదం: పది రోజుల వ్యవధిలోనే భార్య, కూతురు ఆత్మహత్య

17 Jul, 2021 18:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చంఢీగఢ్‌: దేశంలో కరోనా మహమ్మారి ప్రజలను ఆర్థికంగా కొలుకోలేని దెబ్బతీసింది. దీని ఉధృతి కారణంగా ఇప్పటికే చాలా మంది తమ ఉపాధిని కోల్పోవడమే కాకుండా అనేక కుటుంబాలు రోడ్డున పడిన సంగతి తెలిసిందే. అయితే, కొవిడ్‌ కారణంగా తమ ఉద్యోగాలను కోల్పోవడం వలన ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కాగా, తాజాగా మరో కుటుంబం తమ ఉద్యోగాలను కోల్పోవడం వలన ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా  వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం హర్యానాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్‌లో హరిశెట్టి, భార్య వీణలతో కలిసి నివసించేవాడు. వీరిద్దరు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగాలు చేస్తుండేవారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు యశికా యంబీఎ చదువు తుండగా, మరొకూతురు లా చదువుతుంది.

ఈ క్రమంలో కరోనా కారణంగా ఈ దంపతులు గతేడాది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. గత కొంత కాలంగా వీరు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వీరు దాచి ఉంచిన సొమ్ము అంతా అయిపోయింది. వీరు ఇంటి అద్దె, బిల్లులు, ఈయంఐలు కూడా చెల్లించలేని స్థితికి చేరుకున్నారు. దీంతో, హరిశెట్టి తీవ్రంగా కుంగిపోయాడు. కాగా, ఇతను గత జులై 6వ తేదిన ఒక హోటల్‌లో విషాన్ని తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, భర్త మృతిని తట్టుకోలేని భార్య వీణ, కూతురు యశికా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో వీరు కూడా కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ఇంట్లో విషాన్ని తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

కొన్ని రోజులుగా వీరి ఇంట్లో నుంచి ఎవరు బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, పోలీసులు వీరి ఇంటిలో ప్రవేశించి చూడగా అప్పటికే వీణ, యశికాలు కిందపడిఉన్నారు. వీరి పక్కన విషపు మాత్రలు ఉండటాన్ని గమనించారు. వీరి మృతదేహలను పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న గురుగ్రామ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు