ఆక్సిజన్‌ పైప్‌తో ఉరివేసుకుని.. 

30 Mar, 2021 12:09 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి,ముంబై: దేశవ్యాప్తంగా  కరోనా వైరస్‌ మహమ్మారి రెండో దశలో విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో మరింత వేగంగా విస్తరిస్తోంది.  ఈ నేపథ్యంలో  నాగ్‌పూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో 81 ఏళ్ల వృద్ధుడి ఆత్మహత్య ఆందోళన రేపింది. బాత్‌రూం లోపల ఆక్సిజన్ పైపుతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ (ఇన్‌ఛార్జ్) డాక్టర్ కాంచన్ వాంఖడే తెలిపారు. సోమవారం ఈ విషాదం చోటు చేసుకుంది. మృతుడిని పురుషోత్తం అప్పాజీ గజ్భీగా గుర్తించామని అజ్న పోలీసు అధికారి తెలిపారు. కరోనా బారిన పడటంతో మార్చి 26న పురుషోత్తం ఆసుపత్రిలో చేరారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

కాగా సెకండ్‌వేవ్‌లో దేశంలో పలు స్టేట్స్‌లో కరోనా పంజా విసురుతోంది. ముఖ్యంగా మహారాష్ట 3 లక్షల 37 వేలకుపైగా కేసులు, 54 వేలకు పైగా మరణాలతో ఎక్కువ ప్రభావితమైన రాష్ట్రంగా నిలిచింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులలో (360 ఐసీయులతో సహా) ప్రస్తుతం ఖాళీగా ఉన్న 3000 పడకలకు అదనంగా మరో  2269  పడకలను తక్షణమే అందుబాటులోకి తీసుకు రానున్నామని బీఎంసీ కమిషనర్‌ ఇక్బాల్ సింగ్ చాహల్ తాజాగా ప్రకటించారు. మరోవైపు కరోనా జాగ్రత్తలు పాటించని పక్షంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించక తప్పదని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు