వరంగల్‌ ఎంజీఎం: భయంతో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య

31 Jul, 2021 08:29 IST|Sakshi

ఎంజీఎం భవనంపైనుంచి దూకి కరోనా బాధితుడి బలవన్మరణం

2 రోజుల్లో ఆరోగ్యవంతుడివి అవుతావని డాక్టర్ల భరోసా

అయినా భయంతో ఆత్మహత్య 

ఎంజీఎం: కోవిడ్‌ పాజిటివ్‌ బాధితుడతను. ఆస్పత్రిలో చేరిన సమయంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ 66 శాతమే ఉన్నాయి. మనిషి కూడా మానసిక ఆందోళనతో కనిపించాడు. ఇలాంటి తరుణంలో ఆరు రోజులు డాక్టర్లు అతనికి మనోధైర్యం చెబుతూ చికిత్స అందించారు. దాంతో ఆక్సిజన్‌ లెవల్స్‌ 93 శాతానికి పెరిగాయి. ఇక రెండు రోజుల్లో పూర్తి ఆరోగ్యవంతుడివి అవుతావని డాక్టర్లు చెప్పారు. కుటుంబ సభ్యులు కూడా బాగవుతావని భరోసా ఇచ్చారు. అయినా అతనిలో మానసిక ఆందోళన తొలగిపోలేదు. తనకు ఏదో అయిందన్న భయంతో ఆస్పత్రి భవనంపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి..

వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలకేంద్రానికి చెందిన రాయపురం లింగమూర్తి (34) ఈ నెల 24న కోవిడ్‌తో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. 66 ఉన్న ఆక్సిజన్‌ లెవల్స్‌ ఆరు రోజుల్లో 93కు పెరిగాయి. అయినా రెండు రోజులుగా అతను తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆస్పత్రి భవనం రెండో అంతస్తునుంచి కిందకు దూకాడు.

తలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్న క్రమంలోనే మృతిచెందాడు. మరో రెండు రోజులు చికిత్స పొందితే అతను కోలుకుని ఇంటికి వెళ్లేవాడని ఎంజీఎం అధికారులు తెలిపారు. మనోధైర్యమే కరోనాకు సగం మందు అని పేర్కొన్నారు. మృతుడి తమ్ముడు ఉప్పలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు