రూ.వెయ్యి కోట్లకుపైగా కొల్లగొట్టిన చైనీస్‌ కంపెనీ

13 Aug, 2020 17:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ గేమ్స్‌ పేరుతో భారీ మోసం చేసిన అంతర్జాతీయ ముఠా గుట్టు రట్టైంది. ఓ చైనీస్‌ కంపెనీ రూ.1000 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఆ కంపెనీకి చెందిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్ ముఠాను పట్టుకున్నట్లు హైదరాబాద్ సీసీఎస్‌ పోలీసులు తెలిపారు. ఈ ముఠాపై సైబర్ క్రైంలో రెండు కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. టెలిగ్రాం గ్రూప్ ద్వారా అడ్మిన్ సహాయంతో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని తెలిపారు. వెబ్‌సైట్స్‌ను ప్రతిరోజు కొత్తగా మార్చుతూ.. అందులోని సమాచారాన్ని గ్రూప్‌లో తెలుసుకుంటారని చెప్పారు. ఈ కంపెనీలో చైనా, ఇండియాకు చెందిన డైరెక్టర్లు ఉన్నారని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. సుమారు రూ.1,100 కోట్ల నగదు ట్రాన్జాక్షన్ జరిగిందని వెల్లడించారు. (రూ. 1000 కోట్ల హవాలా సొమ్ము: చైనా స్పందన)

పలు బ్యాంకు ఖాతాల్లో రూ.30కోట్లు సీజ్‌ చేశామని వెల్లడించారు. ఒక చైనీయునితో పాటు నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. దీనిపై లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు. ఐటీశాఖకు సమాచారం ఇచ్చామని, ఆన్‌లైన్‌ గేమింగ్ తెలంగాణలో రద్దైందని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌లో మోసపోయి చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని, పిల్లలపై దృష్టి పెట్టాలని సీపీ తెలిపారు. ఆన్‌లైన్‌ తమ పిల్లలు ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు గమనించాలని సీపీ అంజనీ కుమార్‌ సూచించారు.

 

మరిన్ని వార్తలు