టన్నెల్‌ పనుల్లో ప్రమాదం

30 Jul, 2022 01:31 IST|Sakshi

ఐదుగురు కూలీలు మృతి

సాక్షి, నాగర్‌కర్నూల్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు గ్రామ శివారులోని రేగుమాన్‌గడ్డ వద్ద జరుగుతున్న టన్నెల్‌ పనుల్లో ప్రమాదం జరిగింది.  గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఐదుగురు కూలీలు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. టన్నెల్‌లోని పంప్‌హౌస్‌ వద్ద క్రేన్‌ వైర్‌ తెగిపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. పంప్‌హౌస్‌లో అడుగున జరుగుతున్న పనుల కోసం క్రేన్‌ సహాయంతో కాంక్రీట్‌ బకెట్‌ను కిందకు దింపుతుండగా క్రేన్‌వైర్‌ తెగడంతో అది టన్నెల్‌లో ఉన్న కార్మికులపై పడినట్లు తెలిసింది.

ఆ సమయంలో అక్కడ ఆరుగురు కార్మికులు ఉండగా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదస్థలం వద్ద ఇరుక్కుపోయిన మృతదేహాలను ఎయిర్‌ప్రెషర్‌ సహాయంతో బయటకు తీశారు. ఇందుకోసం సుమారు 3 గంటల సమయం పట్టినట్లు అక్కడివారు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఐదుగురి మృతదేహాలను అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నిడదవోలుకు చెందిన దయ్యాల శ్రీను (42), జార్ఖండ్‌కు చెందిన బోలేనాథ్‌ (45), ప్రవీనేజ్‌ (38), కమ్లేశ్‌ (36), బిహార్‌కు చెందిన సోను కుమార్‌(36) ఉన్నట్లు గుర్తించామని ఆసుపత్రివద్ద పోలీసులు తెలిపారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన లాల్‌ బల్విందర్‌ సింగ్‌ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతని కుడిచేతికి తీవ్రగాయం అయినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) స్టే నేపథ్యంలో ప్రాజెక్టు పనులు ప్రస్తుతం నిలిచిపోయాయని, నిర్వహణ పనుల్లో భాగంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాజెక్టు ఈఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని వెల్లడించారు. భవన, నిర్మాణరంగ కార్మికుల కేంద్ర బోర్డు చైర్మన్‌ శ్రీనివాసులు నాయుడు ఘటనాస్థలాన్ని సందర్శించారు. ప్రమాదంపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను సొంతూళ్లకు తరలించారు.  

మరిన్ని వార్తలు