ఇంటర్‌ చదివి.. 20 ఫేక్‌ కంపెనీల సృష్టి!

12 Nov, 2021 04:48 IST|Sakshi

రూ.265 కోట్ల నకిలీ ఇన్‌వాయిస్‌లతో రూ.31 కోట్ల ట్యాక్స్‌ మోసం  

హైదరాబాద్‌కు చెందిన యువకుడిని అరెస్ట్‌ చేసిన డీజీజీఐ

సాక్షి, విశాఖపట్నం: కేవలం ఇంటర్‌ వరకే చదివిన ఆ యువకుడు చిన్న చిన్న వ్యాపార సంస్థల్లో పనిచేస్తూ.. జీఎస్‌టీ లొసుగుల్ని పసిగట్టాడు. అంతే, గుంటూరు, హైదరాబాద్‌ మొదలైన నగరాల్లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 ఫేక్‌ కంపెనీలను సృష్టించి.. పన్ను మోసాలకు పాల్పడేందుకు ఎత్తుగడవేశాడు. నిరంతర తనిఖీల్లో భాగంగా విశాఖపట్నంలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌(డీజీజీఐ) అధికారులు ఆ యువకుడి మోసాన్ని బట్టబయలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన 34 ఏళ్ల యువకుడు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో 20 నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి బిల్లులు సృష్టించాడు.

ఈ సంస్థల నుంచి దేశంలోని వివిధ నగరాల్లోని కంపెనీలకు సరకు లావాదేవీలు జరిపినట్టు రూ.265 కోట్ల మేర నకిలీ ఇన్‌వాయిస్‌లను రూపొందించాడు. వీటిని ఉపయోగించుకుని రూ.31 కోట్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ.. పన్నుల చెల్లింపును ఎగవేసేలా వ్యూహాన్ని అమలుపరిచాడు. ఈ భారీ నకిలీ ఇన్‌వాయిస్‌లని పరిశీలించిన డీజీజీఐ, సెంట్రల్‌ జీఎస్‌టీ వర్గాలు.. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు 20 నకిలీ సంస్థల రాకెట్‌ గుట్టు రట్టయ్యింది.

వెంటనే రంగంలోకి దిగి.. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్టు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ విశాఖపట్నం జోనల్‌ యూనిట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ భాస్కరరావు చెప్పారు. గతేడాది నవంబర్‌ నుంచి ఈ తరహా మోసాలపై దేశవ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విశాఖపట్నం జోనల్‌ యూనిట్‌ పరిధిలో దాదాపు 180 నకిలీ కంపెనీల గుట్టు రట్టు చేసి రూ.60 కోట్లు రికవరీ చేయడంతో పాటు ఐదుగురిని అరెస్ట్‌ చేసినట్టు భాస్కరరావు చెప్పారు. 

మరిన్ని వార్తలు