తెలుగుయువత నేత ఇంట్లో క్రికెట్‌ బెట్టింగ్‌ 

20 May, 2022 04:51 IST|Sakshi
టీడీపీ నేత నల్లమిల్లి రామ కృష్ణారెడ్డితో బెట్టింగ్‌ కేసు ప్రధాన నిందితుడు సత్య (ఫైల్‌)

తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి సత్య సహా ఐదుగురి అరెస్టు 

అనపర్తి: యువతనే లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా క్రికెట్‌ బెట్టింగులు నిర్వహిస్తున్న ఐదుగురిని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీసులు అరెస్టు చేశారు. తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి సబ్బెళ్ల సత్యనారాయణరెడ్డి (సత్య) ఇంట్లోనే నిర్వహిస్తున్న ఈ బెట్టింగ్‌లకు ఆయనే సూత్రధారి అని పోలీసులు తెలిపారు. అనపర్తి సీఐ జె.వి.రమణ గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

అనపర్తి మండలం రామవరంలో ఓ ముఠా క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో పోలీసులు సబ్బెళ్ల సత్యనారాయణరెడ్డి ఇంటిపై బుధవారం రాత్రి దాడిచేశారు. ఆ సమయంలో అక్కడ సత్య, మరో నలుగురు యువకులు ఐపీఎల్‌ మ్యాచ్‌పై బెట్టింగ్‌ నిర్వహిస్తూ పట్టుబడ్డారు.

సత్యతో పాటు తేతలి కృష్ణారెడ్డి, కర్రి రమాకాంతరెడ్డి, కర్రి వీరవెంకటసత్యనారాయణరెడ్డి, తమలంపూడి వెంకటరెడ్డిలను అరెస్టు చేసి.. రూ.2.50 లక్షల నగదు, 8 సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, టీవీ, బెట్టింగ్‌ లావాదేవీలు, బెట్టింగ్‌ ఆడుతున్నవారి వివరాలతో ఉన్న పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.

సత్య ఆధ్వర్యంలోనే బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రధాన బుకీలు, పంటర్లు ఎవరనే దానిపై లోతైన విచారణ నిర్వహించి, దీంతో సంబంధమున్న వారందర్నీ అరెస్ట్‌ చేస్తామని సీఐ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు