జడ్చర్లలో దారుణం... చెల్లిని ప్రేమించాడని చంపేశారు

11 Aug, 2022 01:54 IST|Sakshi
సింగిదాస్‌ కృష్ణ  

జడ్చర్ల: తన చెల్లిని ప్రేమించిన యువకుడిని ఆమె సోదరులు దారుణంగా హత్య చేసిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంలో జరిగింది. సీఐ రమేశ్‌బాబు కథనం ప్రకారం.. మండల పరిధిలోని కిష్టారం గ్రామానికి చెందిన సింగిదాస్‌ కృష్ణ (24) అదే గ్రామానికి చెందిన యువతి నందిని (17) ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒకే కులానికి చెందిన వారు కావడంతో మరింత దగ్గరయ్యారు.

ఈ విషయం సదరు యువతి సోదరులు సింగిదాస్‌ మోహన్, సింగిదాస్‌ విజయ్‌కి తెలిసింది. కాగా, మంగళవారం రాత్రి మొహర్రం వేడుకల్లో అందరూ నిమగ్నమైన సమయంలో గ్రామశివారులోని మొక్కజొన్న చేనులో కలుసుకోవడానికి కృష్ణ, నందిని వెళ్లారు. ఇది గమనించిన ఆమె సోదరులు అక్కడకు చేరుకుని కృష్ణ కడుపులో కత్తితో పొడవడంతో పేగులు, అవయవాలు బయటకు వచ్చాయి. తనను ఎలాగైనా కాపాడాలని కృష్ణ వేడుకోవడంతో వారే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి, వెంటనే చికిత్స కోసం మహబూబ్‌నగర్‌ సమీపంలోని ఏనుగొండ ఎస్‌వీఎస్‌ ఆస్పత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 8 గంటలకు మృతి చెందాడు. కృష్ణ ఆటో నడుపుతుంటాడని తల్లిదండ్రులు జంగమ్మ, బాలయ్య కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితులు జడ్చర్ల పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు