కడపలో యువకుడి దారుణ హత్య   

26 May, 2022 22:40 IST|Sakshi

డబ్బులకోసం స్నేహితులే మట్టుపెట్టారు  

హతుని శరీరంపై 25 కత్తిపోట్లు  

సంఘటన స్థలాన్ని పరిశీలించిన కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి  

కడప అర్బన్‌: కడప నగరంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నకాష్‌ కాల్వకట్ట సమీపంలో పఠాన్‌ ఇమ్రాన్‌ఖాన్‌ (23) అనే యువకుడిని దారుణంగా హత్య చేసి, కాల్వలో పడేశారు.డబ్బుల వ్యవహారంలో స్నేహితులే అతని నిండుప్రాణాలను బలితీసుకున్నారు. అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి, ఇన్‌చార్జి సీఐ అశోక్‌రెడ్డి, కడప ఒన్‌టౌన్‌ సీఐ ఎన్‌వి నాగరాజు, చిన్నచౌక్‌ ఎస్‌ఐ ఎస్‌కె రోషన్, కడప టూటౌన్‌ ఎస్‌ఐలు తులసీనాగప్రసాద్, రాఘవేంద్రారెడ్డిలు తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

పోలీసులు, మృతుని సోదరి సయ్యద్‌ పర్వీన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.  కడప నగరం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఖలీల్‌నగర్‌లో పఠాన్‌ ఇమ్రాన్‌ఖాన్‌ (23) నివాసం ఉంటున్నాడు. అతనికి తల్లిదండ్రులతో పాటు, అన్న, అక్క, చెల్లెలు ఉన్నారు. ప్లంబర్‌ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో కువైట్‌కు కొన్ని రోజుల్లో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

అతని స్నేహితులైన రామకృష్ణనగర్‌కు చెందిన షేక్‌ అస్రర్‌ అలియాస్‌ ఆషు(22), మరో స్నేహితుడు రాజారెడ్డివీధికి చెందిన షేక్‌ యూనస్‌లు ఇమ్రాన్‌ఖాన్‌ వద్ద తమ అవసరాలకు అప్పుడప్పుడు డబ్బులు తీసుకునేవారు. వీరిలో అస్రర్‌ ఎలక్ట్రీషియన్‌గా, యూనస్‌ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. వీరు ఇమ్రాన్‌ఖాన్‌కు దాదాపు రూ.3లక్షలు బాకీ పడ్డారు. ఈ డబ్బులు ఇవ్వాలని ఇమ్రాన్‌ఖాన్‌ వీరిని అడిగేవాడు. ఈక్రమంలో వీరిమధ్య వాగ్వాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 10:30 గంటల సమయంలో ఖలీల్‌నగర్‌లో తన ఇంటి వద్ద ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌ను షేక్‌ అస్రర్, షేక్‌ యూనస్‌లు తాము డబ్బులు ఇస్తామని చెప్పి తమ వెంట తీసుకుని వెళ్లారు.

అతన్ని నకాష్‌లోని కాల్వగట్టు వద్దకు తీసుకుని వెళ్లి యూనస్‌ పట్టుకోగా షేక్‌ అస్రర్‌ తన వద్ద ఉన్న కత్తితో ఇమ్రాన్‌ఖాన్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. వీపుపై దాదాపు 25 కత్తిపోట్లు పొడిచాడు. రక్తపుమడుగులో ఇమ్రాన్‌ఖాన్‌ కొట్టుమిట్టాడుతూ, పూర్తిగా చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత పక్కనే కాల్వలో పడేశారు. తరువాత స్థానికులు గమనించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కడప టూటౌన్‌ ఎస్‌ఐ తులసీనాగప్రసాద్‌ తెలిపారు. ఈ సంఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.   

మరిన్ని వార్తలు