తండ్రికి శిక్ష పడుతుందని కుమార్తె ఆత్మహత్య 

11 May, 2022 01:43 IST|Sakshi

బోధన్‌: ఘర్షణ కేసులో తన తండ్రికి శిక్ష పడుతుందని గ్రామస్తులు చెప్పిన మాటలతో మనస్తాపానికి గురై ఒక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన పల్లెపు హేమలతతో మాక్లూర్‌ మండలం కల్లెడకు చెందిన కొమిరె రమేశ్‌కు ఆరేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు.

 భార్యాభర్తల మధ్య విభేదాలతో కొన్నాళ్లుగా హేమలత పుట్టింటి వద్దే ఉంటోంది. ఈనెల 5న ధర్మారంలో నిర్వహించిన పంచాయతీ మాటామాటా పెరిగి రణరంగంగా మారింది. ఇరువర్గాలు ఒకరిపై దాడులు చేసుకోగా, రమేశ్‌ తరçఫు నుంచి వచ్చిన జక్రాన్‌పల్లి మండ లం అర్గుల్‌కు చెందిన దండికోట రాజయ్య మృతిచెందాడు. దీంతో ధర్మారానికి చెందిన ఆరుగురిపై కేసు నమోదైంది.

ఇందులో బొడసు నారాయణకు జీవిత కాల శిక్ష పడుతుందని గ్రామస్తులు కొందరు అతని కుమార్తె తేజస్విని(15)కి చెప్పారు. తీవ్ర మనస్తాపానికి గు రైన తేజస్విని ఆదివారం ఇంట్లోనే పురుగు మందు తాగింది. స్థానికులు జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, మంగళ వారం మృతిచెందింది. తేజస్విని దాస్‌నగర్‌ సమీపంలోని గురుకుల పాఠశాలలో ఇటీవలే తొమ్మిదో తరగతి పూర్తి చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు