ప్రాణాలు తీసిన డిప్రెషన్‌

13 May, 2022 04:23 IST|Sakshi

కుమారుడు తండ్రికి దగ్గరవుతున్నాడనే అఘాయిత్యం 

చనిపోవాలని తల్లీకూతుళ్ల నిర్ణయం 

ముందుగా 18 నెలల మనవడి గొంతు నులిమి.. ఆపై ఆత్మహత్యకు పాల్పడిన అమ్మమ్మ 

ప్రాణాపాయస్థితిలో బాలుడి తల్లి 

హైదరాబాద్‌లో విషాదం 

నిజాంపేట్‌ (హైదరాబాద్‌): గోరు ముద్దలు తినిపించాల్సిన అమ్మమ్మే గొంతు నులిమి ఊపిరి తీసింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతల్లి పేగుబంధాన్ని తెంపేసుకుంది. 12 ఏళ్ల క్రితం దూరమైన కుటుంబ పెద్దను కుమారుడు దగ్గర చేసే యత్నంలో.. ఇది నచ్చని తల్లీకూతుళ్లు తీవ్ర మానసిక క్షోభకు గురై చనిపోవాలనుకున్నారు. ఈ క్రమంలో 18 నెలల బాలుడి ఊపిరి తీసి ఉరి వేసుకున్నారు.

వీరిలో తల్లి చనిపోగా కూతురు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషాద ఘటన గురువారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా శాయంపేట మండలం నేరేడుపల్లికి చెందిన లలిత (56), కృష్ణమూర్తి దంపతులు హైదరాబాద్‌లోని నిజాంపేట్‌ వినాయకనగర్‌లో ఉంటున్నారు. వీరికి కుమారుడు శ్రీకర్‌. ఇద్దరు కూతుళ్లు అర్చన, దివ్య ఉన్నారు. లలిత భర్త కృష్ణమూర్తి 12 ఏళ్ల క్రితం భార్యతో విభేదించి వేరుగా ఉంటున్నాడు. లలిత ఇద్దరు కూతుళ్ల వివాహాలు చేసి అత్తారిళ్లకు పంపించింది. శ్రీకర్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. 

నాలుగేళ్లుగా కుటుంబంలో మనస్పర్థలు.. 
నాలుగేళ్ల క్రితం దివ్య వివాహం సమయంలో శ్రీకర్‌ తన తండ్రి కృష్ణమూర్తిచే కన్యాదానం చేయించాలని కుటుంబంలో ప్రతిపాదన తెచ్చాడు. దీనికి తల్లి లలిత, చెల్లెలు దివ్య ఒప్పుకోలేదు. ఆయన వస్తే తను పెళ్లి చేసుకోనని దివ్య కరాఖండీగా చెప్పింది. దీంతో శ్రీకర్‌ తన ప్రతిపాదన విరమించుకున్నాడు. అప్పటి నుంచి శ్రీకర్‌ తన తండ్రి కృష్ణమూర్తితో టచ్‌లో ఉన్నట్లు మిగతా కుటుంబ సభ్యులు భావిస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో కూకట్‌పల్లిలో కూతురు దివ్య వద్ద లలిత కొద్ది రోజులు.. కుమారుడి వద్ద కొద్ది రోజులు ఉంటూ వస్తోంది. కుమారుడి వయసు 35 ఏళ్లు దాటుతున్నా వివాహం కాకపోవడం, సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరడం లేదని లలిత ఆందోళనకు గురయ్యేది. దీనికి తోడు ఎప్పుడో దూరమైన భర్తకు కుమారుడు దగ్గరవుతున్నాడనే అనుమానం పెరిగిపోసాగింది.  

ఆత్మహత్యకు ప్రేరేపించిన లలిత.. 
15 రోజుల క్రితం దివ్యతో లలిత తనకు బతకాలని లేదని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో తల్లితో ఎక్కువ అనుబంధం ఉన్న దివ్య ఆమె లేని జీవితం తనకూ వద్దనుకుంది. తాము చనిపోతే శివ కార్తికేయ అనాథ అవుతాడని, దీంతో బాలుడినీ చంపాలని తల్లీకూతుళ్లు నిర్ణయించుకున్నారు. 

మొదట చిన్నారి గొంతునులిమి..  
ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న తల్లీకూతుళ్లు.. మొదట శివ కార్తికేయను గొంతు నులిమి అమ్మమ్మ లలిత ఊపిరితీసింది. అనంతరం తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మరో గదిలో దివ్య చున్నీతో మెడకు వేసుకుని చనిపోవాలని తీవ్రంగా ప్రయత్నించింది.

తన శక్తి చాలకపోవడంతో తెల్లవారుజామున పక్కగదిలో ఉన్న శ్రీకర్‌ను నిద్ర లేపింది. ఆందోళనకు గురైన అతడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని దివ్యను ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో తమ మృతికి ఎవరూ కారణం కాదనే సూసైడ్‌ నోట్‌ పోలీసులకు లభించింది. 

మరిన్ని వార్తలు