కామారెడ్డిలో దారుణం.. కుళాయి వద్ద గొడవ.. కక్ష పెంచుకుని హత్య 

18 May, 2022 01:36 IST|Sakshi
సీసీ కెమెరాలో హత్యకు పాల్పడుతున్న దృశ్యం  

కామారెడ్డి క్రైం: కుళాయి దగ్గర జరిగిన గొడవ ఒకరి హత్యకు కారణమైంది. కామారెడ్డి జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్‌కు చెందిన పులి గంగాధర్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య నిజామాబాద్‌ లో, రెండవ భార్య రాజమణి కామారెడ్డిలోని వేణుగోపాలస్వామి రోడ్‌ ప్రాంతంలో నివాసం ఉంటారు.

మొదటి భార్య కొడుకైన రవికుమార్‌(40) ఏ పనీ లేకపోవడంతో రెండేళ్లుగా కామారెడ్డిలోని తన పిన్ని దగ్గరే ఉంటున్నాడు. అయితే గతంలోనే రవికి గీత అనే మహిళతో పెళ్లికాగా, ఇద్దరు కొడుకులున్నారు. పనిచేయడానికి ఇష్ట పడకపోవడంతో భార్య గీత పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. కొద్దిరోజుల క్రితం తండ్రి గంగాధర్‌ రెండో భార్య వద్దకు వచ్చి అక్కడ పనిచేయకుండా ఇంట్లోనే ఉంటున్న రవిని బయటకు గెంటేశాడు.

అప్పటి నుంచి రాంమందిర్‌రోడ్‌ శివాలయం ప్రాంతంలో తిరుగుతూ ఎవరైనా పనిచెబితే చేసుకుంటూ రాత్రి గుడి అరుగులపై పడుకుంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి రామాలయం ఎదురుగా ఉన్న ఓ వ్యాపార సముదాయం అరుగుపై నిద్రించా డు. అర్ధరాత్రి దాటాక రవి తలపై గుర్తు తెలియని వ్యక్తి బండరాయితో బలం గా మోదడంతో అక్కడికక్కడే చనిపోయాడు.

సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. నిందితుడు రిక్షా పుల్లర్‌ అడ్డగారి పాండుగా గుర్తించారు. నీళ్ల కుళాయి వద్ద మంచినీళ్లు పట్టుకునే విషయంలో గొడవ జరగడంతో కక్ష పెంచుకుని ఈ హత్య చేసినట్లు పాండు విచారణలో అంగీకరించాడు. గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన డీఎస్పీ సోమనాథం పట్టణ ఎస్‌హెచ్‌ఓ నరేశ్, ఎస్సైలు అహ్మద్, రాములు, సిబ్బంది మల్లేశ్‌గౌడ్, సయిద్‌ను ప్రత్యేకంగా అభినందించారు. 

మరిన్ని వార్తలు