హంతకులను ఉరి తీయాలి.. నీరజ్‌ పన్వార్‌ భార్య సంజన డిమాండ్‌

22 May, 2022 01:31 IST|Sakshi
షాహినాయత్‌ గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ ముందు రోదిస్తున్న మృతుడి భార్య సంజన 

తనకు, బాబుకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి

నలుగుర్ని అరెస్టు చేశాం:వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌

అబిడ్స్‌/నాంపల్లి: నీరజ్‌ పన్వార్‌ను తన బంధువులే చంపారని, హత్య చేసిన వారిని ఉరి తీయాలని మృతుడి భార్య సంజన డిమాండ్‌ చేశారు. తాను, నీరజ్‌.. ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరమా అని ప్రశ్నించారు. తన కజిన్‌ బ్రదర్సే నీరజ్‌ను చంపారని వెల్లడించారు. ఫాస్‌ట్రాక్‌ కోర్టు ద్వారా కేసు విచారణ జరపాలని, నిందితులపై పీడీయాక్ట్‌ నమోదు చేయాలని కోరారు.

నీరజ్‌ హత్యను నిరసిస్తూ.. సంజన, స్థానిక వ్యాపారులు శనివారం ఆందోళనకు దిగారు. దీంతో బేగంబజార్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది వ్యాపారులు దుకాణాలను మూసివేసి ఆందోళన చేశారు. షాహినాయత్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ ముందు 2 నెలల పసికందుతో సంజన, ఆమె బంధువులు, వ్యాపారులు దాదాపు 3 గంటల పాటు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

హంతకులను ఉరితీయాలని, అంతవరకు ఆందోళన చేస్తామని బైఠాయించారు. వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం సంజన మీడియాతో మాట్లాడారు. హంతకులు తన 2 నెలల కొడుకును కూడా చంపుతారన్న భయాందోళన వ్యక్తం చేశారు. వాళ్లు గతంలో తనను, నీరజ్‌ను చాలాసార్లు బెదిరించారని చెప్పారు.

తనకు, అత్తామామలకు, తన కొడుకుకు పోలీసులు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారికి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తన కళ్లెదుటే నీరజ్‌ను పొడిచేశారని అతని తాత జగదీశ్‌ పన్వార్‌ వాపోయారు. తను, నీరజ్‌ బేగంబజార్‌ ఫిష్‌మార్కెట్‌ వద్ద వెళ్తుండగా, వెంబడించిన ఐదుగురు దుండగులు తమ ముందుకొచ్చి కళ్లల్లో ఏదో చల్లారన్నారు.

దీంతో తమకు ఏమీ కనిపించలేదని చెప్పారు. దుండగులు నీరజ్‌ తలపై బండరాయితో కొట్టి కత్తులతో పొడిచారని పేర్కొన్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించగా తనపై కూడా దాడి చేశారన్నారు. చంపుతామని బెదిరిస్తున్నారని ఏడాది క్రితమే అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇలా జరిగిందని రోదిస్తూ వెల్లడించారు.

కులాంతర వివాహం నచ్చకే.. 
బేగంబజార్‌ పరువు హత్య కేసును షాహినాయత్‌గంజ్‌ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నీరజ్‌ను హత్య చేసిన ఆరుగురిలో నలుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. అరెస్టయిన వారిలో ఒక మైనర్‌ బాలుడు ఉన్నట్లు పశ్చిమ మండల డీసీపీ జోయల్‌ డేవిస్‌ వెల్లడించారు. ఈ మేరకు శనివారం గోషామహల్‌లోని షాహినాయత్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు హత్య వివ రాలు వెల్లడించారు.

‘కోల్సావాడికి చెందిన రాజేంద్రప్రసాద్‌ పన్వార్‌ కుమారుడు నీరజ్‌(20) వృత్తిరీత్యా వేరుశనగ గింజల వ్యాపారం చేస్తుంటారు. అదే బస్తీలో ఉండే సంజనను నీరజ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే సంజన తల్లిదండ్రులు ఈ వివాహాన్ని వ్యతిరేకించారు. దీంతో పాతబస్తీలో ఫలక్‌నుమాలోని శంషీర్‌గంజ్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని  నీరజ్, సంజన జీవిస్తున్నారు.

అయితే నీరజ్‌ వ్యాపారం బేగంబజార్‌లో ఉండటంతో రోజూ ఫలక్‌నుమా నుంచి వచ్చి పోతుండేవారు. కులాంతర వివాహం చేసుకున్న నీరజ్‌ను అంతమొందించాలని 15 రోజుల నుంచి సంజన బంధువులు బేగంబజార్‌కు వచ్చి రెక్కీ నిర్వహించారు. కోల్సావాడికి చెందిన సంజన బంధువులైన మదన్‌లాల్‌ కుమారుడు అభినందన్‌ యాదవ్‌ అలియాస్‌ నందన్‌(26), యాదవ్‌లాల్‌ యాదవ్‌ కుమారుడైన కె.విజయ్‌(22), జై చరణ్‌ యాదవ్‌ కుమారుడు కె.సంజయ్‌(25), శ్రవణ్‌ యాదవ్‌ కుమారుడు బి.రోహిత్‌(18), అఫ్జల్‌గంజ్‌ నివాసి మహేష్‌ అహీర్‌ యాదవ్‌ అలియాస్‌ గోటియా(21), మరో మైనర్‌ బాలుడితో కలసి హత్యకు కుట్రపన్నారు.

ఇందులో భాగంగా జుమేరాత్‌ బజార్‌లో కత్తులు కొనుగోలు చేశారు. శుక్రవారం సాయంత్రం పీకల దాకా మద్యాన్ని సేవించారు. నీరజ్‌ను చంపేందుకు 2 ద్విచక్ర వాహనాలపై బేగంబజార్‌కు చేరుకున్నారు. నీరజ్‌ తన తాతతో కలసి వెళ్తుండగా అడ్డగించి కత్తులతో పొడిచి పారిపోయారు. నీరజ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో హత్య కేసు నమోదు చేసుకుని ఏడు బృందాలను రంగంలోకి దించాం. నగర శివార్లలో తలదాచుకున్న నలుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అభినందన్‌ యాదవ్, మహేష్‌ యాదవ్‌ను త్వరలోనే పట్టుకుంటాం’అని డీసీపీ వెల్లడించారు.   

మరిన్ని వార్తలు