ప్రేమ జంట ఆత్మహత్య 

12 Aug, 2022 03:11 IST|Sakshi
రవి (ఫైల్‌), అనూషా(ఫైల్‌)  

మైలార్‌దేవ్‌పల్లి: తమ ప్రేమకు అడ్డు చెప్పారని భావించిన ఓ ప్రేమ జంట అర్థాంతరంగా తనువు చాలించారు. ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పడంతో మనస్తాపానికి గురై గురువారం ఒకే తాడుకు ఉరి వేసుకొని తనువులను చాలించారు. అమ్మాయి 17 ఏళ్ల మైనర్‌ బాలిక. మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ కె.నర్సింహ్మ, ఎస్సై రోహిత్‌ తెలిపిన మేరకు.. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఇరు కుటుంబాలు మైలార్‌దేవ్‌పల్లి ఓల్డ్‌ కర్నూల్‌ రోడ్డు సమీపంలో ఉన్న నేతాజీనగర్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు.

చిటికెల నారాయణ స్థానికంగా నివాసం ఏర్పర్చుకోని కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. నారాయణ కుమార్తె అనూషా ఇటీవలనే ఇంటర్మీడియట్‌  బైపీసీ పూర్తి చేసింది. వెయ్యి మార్కులకు గాను 990 మార్కులతో రాష్ట్రస్థాయిలో నిలిచింది. వీరి ఇంటి సమీపంలోనే ఆటో డ్రైవర్‌ రవి కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. అనూషా, రవికుమార్‌ల మధ్య ప్రేమ చిగురించింది.

ఈ విషయం ఇంట్లో తెలియడంతో పెద్దలు మందలించారు. దీంతో రవి కుటుంబసభ్యులు ఇతర ప్రాంతానికి మకాం మార్చారు. శంషాబాద్‌లో తల్లితో కలిసి ఓ శుభకార్యానికి హాజరైన రవి నేతాజీనగర్‌లో ఉన్న పాత ఇంటికి వచ్చాడు. అనూషాతో కలిసి ఇంట్లోకి ప్రవేశించి గురువారం తెల్లవారుజామున ఒకే తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు