9వేల బస్తాల ధాన్యం పట్టివేత

16 May, 2022 02:29 IST|Sakshi
మక్తల్‌లో పట్టుబడిన ధాన్యం లోడు లారీలు 

16 లారీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

కర్ణాటక నుంచి తెలంగాణకు అక్రమంగా తరలింపు 

మక్తల్‌: ఎలాంటి అను మతి లేకుండా కర్ణాటక నుంచి తెలంగాణకు ఒకేసారి 16 లారీలలో తీసుకువ స్తున్న సుమారు తొమ్మిది వేల ధాన్యం బస్తాలను మక్తల్‌ పోలీసు లు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి సిర్‌పూర్, సిర్‌వార్, మాన్వే, రాయచూర్‌ నుంచి ధాన్యం లోడుతో ఈ లారీలు ఆదివారం తెల్లవారుజామున వస్తుండగా నారాయణపేట జిల్లా మక్తల్‌ పట్టణంలో సీఐ సీతయ్య, ఎస్‌ఐ రాములు పట్టుకున్నారు.

ఒక్కో లారీలో 500 నుంచి 800 వరకు ధాన్యం బస్తాలు ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.రెండు కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలాఉండగా నల్లగొండ నుంచి కర్ణాటక రాష్ట్రానికి సిమెంట్‌ తీసుకుని వెళ్లామని.. తిరుగు ప్రయాణంలో కొందరు వ్యక్తులతో మాట్లాడుకుని ధాన్యం లోడ్‌ తీసుకువస్తున్నామని లారీ డ్రైవర్లు చెప్పడం గమనార్హం. 

సరిహద్దు చెక్‌పోస్టు ఎలా దాటారు!
నారాయణపేట జిల్లా కృష్ణ మండలం వాసునగర్‌ వద్ద సరిహద్దు చెక్‌పోస్టు ఉన్నా ఈ లారీలను పట్టుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణలో ధాన్యం రేటు ఎక్కువగా ఉండటంతో కర్ణాటకలో దళారుల నుంచి కొని.. కొందరు పెద్దల సహకారంతో ఇలా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు