లిఫ్ట్‌ అడిగి.. ఇంజక్షన్‌ గుచ్చి.. 

20 Sep, 2022 03:11 IST|Sakshi

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ద్విచక్ర వాహనదారుడి హత్య? షేక్‌ జమాల్‌ అనే వ్యక్తిని లిఫ్ట్‌ అడిగి బైక్‌ ఎక్కిన అగంతకుడు కాసేపటికే ఇంజక్షన్‌ గుచ్చి వెనకాలే వచ్చిన అనుచరుడితో కలసి పరార్‌ కళ్లు తిరుగుతున్నాయంటూ భార్యకు ఫోన్‌ చేసి సొమ్మసిల్లిన వ్యక్తి పీహెచ్‌సీకి తరలించిన స్థానికులు.. చికిత్స మొదలుపెట్టేలోగానే మృతి 

ముదిగొండ: మానవతా దృక్పథంతో సాయం చేయడమే ఆయన చేసిన పాపమైంది... రోడ్డుపై లిఫ్ట్‌ అడిగిన అగంతకుడిపై జాలిపడి ద్విచక్ర వాహనం ఎక్కించుకోవడమే ఆయన ప్రాణాలను బలిగొంది... బండి ఎక్కిన కాసేపటికే దుండగుడు ఇంజక్షన్‌గుచ్చడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన ఆయన... కాసేపటికే ప్రాణాలు విడవడం అందరినీ కలచివేసింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లబి సమీపాన సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం... ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్‌ జమాల్‌ సాహెబ్‌ సుతారీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏపీలోని గండ్రాయి గ్రామంలో ఉండే పెద్ద కుమార్తె వద్దకు సోమవారం ఉదయం ఆయన ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో వల్లబి సమీపాన మాస్క్‌ ధరించిన గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్‌ అడిగాడు.

దీంతో జమాల్‌ అతన్ని బండి ఎక్కించుకున్నాడు. కొంతదూరం ప్రయాణించగానే ఆ అగంతకుడు జమాల్‌ తోడపై ఇంజక్షన్‌ గుచ్చాడు. ఆందోళనకు గురైన జమాల్‌ బండి ఆపడంతో అగంతకుడు దిగి ముందుకు పరుగెత్తాడు. అంతలోనే వెనకాల నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన మరో వ్యక్తి ఆ నిందితుడిని ఎక్కించుకొని పారిపోయాడు. ఈ క్రమంలో స్పృహ తప్పి కిందపడిపోయిన జమాల్‌ను మల్లారం గ్రామానికి చెందిన తిరుపతిరావు, శివ గుర్తించి నీళ్లు చల్లగా స్పృహలోకి రావడంతో వివరాలు ఆరా తీశారు.

దీంతో జమాల్‌ తన భార్యతో మాట్లాడించాలని ఫోన్‌ ఇచ్చి పాస్‌వర్డ్‌ కూడా చెప్పాడు. ఫోన్‌లో భార్య, కూతురుతో మాట్లాడిన జమాల్‌ తనకు కళ్లు తిరుగుతున్నాయని చెప్పాడు. అలాగే అల్లుడు షేక్‌ లాల్‌సాహెబ్‌కు సమాచారం ఇచ్చాడు. అనంతరం జమాల్‌ను శివ, తిరుపతిరావు తమ వాహనంపై వల్లభి పీహెచ్‌సీకి తీసుకెళ్లగా డాక్టర్‌ ధర్మేందర్‌ పరీక్షించి అపస్మారక స్థితిలోకి వెళ్తున్నాడంటూ సెలైన్‌ పెట్టేలోగా శ్వాస ఆగిందని నిర్ధారించాడు. అనంతరం అక్కడకు చేరుకున్న జమాల్‌ అల్లుడికి మరణవార్తను తెలియజేశాడు. 

రంగంలోకి పోలీసులు.
సమాచారం అందు కున్న ఖమ్మం రూరల్‌ ఏసీపీ బస్వారెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్సై ఘట నాస్థలం నుంచి ఇంజక్షన్, సూది, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు సీసీ పుటేజీ కోసం ఆరా తీశారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతుడి అల్లుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని జమాల్‌ మృతదేహానికి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేపట్టి బంధువులకు అప్పగించారు. వైద్యు లు మృతుడి రక్తం, అవయవాల నమూనాలు సేకరించి వరంగల్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని, వివిధ కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. 


 జమాల్‌కు గుచ్చిన ఇంజక్షన్‌   

ఆ ఇంజెక్షన్‌ మత్తుమందేనా? 
జమాల్‌కు అగంతకుడు అత్యధిక మోతాదులో మత్తు ఇంజక్షన్‌ ఇచ్చినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ ప్రభుత్వ వైద్యాధికారి వివరించారు. ఒకేసారి హైడోస్‌ మత్తు మందు ఇవ్వడం, ఏం జరుగుతుందోననే ఆందోళనతో జమాల్‌ మృతి చెంది ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే పోస్టుమార్టం నివేదికతోపాటు ఫోరెన్సిక్‌ నివేదిక వస్తేనే జమాల్‌కు ఇచ్చింది మత్తు మందా లేక ఆయనపై విష ప్రయోగం జరిగిందా అనేది తేలుతుందన్నారు. కాగా, జమాల్‌కు ఆస్తి గొడవలు సైతం ఏవీ లేవని బొప్పారం గ్రామస్తులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు