Hyderabad: రోజూ నలుగురు మగాళ్లు మిస్‌!.. ఎన్నెన్నో కారణాలు

14 May, 2022 02:35 IST|Sakshi

సైబరాబాద్‌ పరిధిలో రోజూ నలుగురు మిస్సింగ్‌  

ఈ ఏడాది 4 నెలల్లోనే 482 మంది గాయబ్‌ 

ఏటా పెరుగుతున్న మిస్సింగ్‌ కేసులు.. 2020లో 1,334 మంది.. 2021లో 1,609 మంది మిస్‌ 

ఇష్టం లేని పెళ్లి, ఆర్థిక ఇబ్బందులే కారణం

ప్రత్యేక వ్యవస్థతో ట్రేస్‌ చేసి పట్టుకుంటున్నాం: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర

పిల్లలు జాగ్రత్త అని చీటీ రాసి.. 
బతుకుదెరువు కోసం కర్నూలు నుంచి హైదరాబాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి 8 ఏళ్ల కిందట వచ్చిన చాకలి రాజు.. పుప్పాలగూడలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి వద్ద చిట్టీలు వేయడం, అప్పులు చేయడం చేస్తుండేవాడు. ఈ క్రమంలో అతనికి రూ.1.5 లక్షలు ఇవ్వాల్సి ఉంది. వాటి గురించి ఒత్తిడి పెరగడంతో ఇటీవల తన స్కూటీని భార్య పనిచేసే గేటెడ్‌ కమ్యూనిటీ సెక్యూరిటీ గార్డుకు ఇచ్చి స్కూటీ డిక్కీలో ‘పిల్లలు జాగ్రత్త’ అని చీటీ రాసి అదృశ్యమయ్యాడు. 

రెండు ఇళ్లల్లో గొడవపడి.. 
హైదరాబాద్‌లోని వసంతనగర్‌కు చెందిన పొక్కలపాటి సురేశ్‌ వర్మ ప్రైవేట్‌ ఉద్యోగి. నైట్‌ డ్యూటీ ఉందని చెప్పి గతేడాది డిసెంబర్‌లో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అతని భార్య వర్మ బావ ప్రసాద్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. తెలిసిన వ్యక్తులు, ప్రాంతాల్లో వెతికే పనిలో ఉండగా.. డిసెంబర్‌ 24న గుర్తు తెలియని ఫోన్‌ నంబర్‌ నుంచి ఓ మహిళ ప్రసాద్‌కు ఫోన్‌ చేసి మీ బామ్మర్ది, నేను ఐదేళ్లుగా కలిసి ఉంటున్నామని, రెండేళ్ల క్రితం వివాహం కూడా చేసుకున్నామని చెప్పింది. శాతవాహన నగర్‌ కాలనీలో నివాసముంటున్న తనతో గొడవపడి బైక్, ఫోన్‌ ఇక్కడే వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడని తెలిపింది. 
–సాక్షి, హైదరాబాద్‌

.. ఇలా ఒకరిద్దరు కాదు, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 482 మంది పురుషులు అదృశ్యమయ్యారు. సగటున రోజుకు నలుగురు గాయబ్‌ అవుతున్నారు. అత్యధికంగా మాదాపూర్‌ జోన్‌లో 194 మంది మగాళ్లు తప్పిపోగా.. బాలానగర్‌ జోన్‌ పరిధిలో 136 మంది, శంషాబాద్‌ జోన్‌లో 152 మంది కనబడకుండా పోయారు. ఈ 3 జోన్లలో కలిపి 332 మందిని గుర్తించారు. గత రెండేళ్లలో 2,943 మంది  అదృశ్యమయ్యారు. 

చెప్పాపెట్టకుండా.. 
ఇష్టం లేని పెళ్లి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే పురుషులు అదృశ్యమవడానికి ప్రధాన కారణాలని రాచకొండ డీసీపీ క్రైమ్స్‌ కల్మేశ్వర్‌ శింగేనవర్‌ తెలిపారు. అన్‌సౌండ్‌ మైండ్‌ (మానసికంగా దృఢంగా లేనివాళ్లు) తప్పిపోతే.. వాళ్ల ఆచూకీకి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఒత్తిడి, పెట్టుబడుల్లో నష్టం, రుణాల వల్ల విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు చెప్పాపెట్టకుండా వెళ్లిపోతున్నారని మరో పోలీసు అధికారి తెలిపారు. ‘‘ఇటీవల మాదాపూర్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగి అప్పులు చేసి మరీ షేర్‌ మార్కెట్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. నష్టం రావడంతో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు పీఎస్‌లో కేసు నమోదయింది’’ అని ఆయన చెప్పారు. 

వలస కార్మికుల పరారీ 
బీహార్, ఉత్తర్‌ ప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్‌ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలాది మంది వలస కార్మికులు భవన నిర్మాణ పనుల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తుంటారు. వీరిలో చాలా మంది కాంట్రాక్టర్లకు చెప్పకుండా రాత్రికిరాత్రే పని ప్రదేశాల నుంచి పారిపోతున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనిల్‌ ఓరన్‌ పుప్పాలగూడలోని అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ నిర్మిస్తున్న ప్రాజెక్టులో లేబర్‌గా చేరాడు.

గత నెల 2న నార్సింగి మార్కెట్‌కు వెళ్లి తిరిగి లేబర్‌ క్యాంప్‌కు రాకపోవడంతో సైట్‌ ఇంజనీర్‌ దాసరి ప్రతాప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పని ప్రదేశాలలో గొడవలు, అప్పులు, ఒత్తిడితో కార్మికులు పనులను వదిలేసి అదృశ్యమవుతున్నట్లు విచారణలో తేలింది.

ట్రాకింగ్‌ అండ్‌ ట్రేసింగ్‌: అదృశ్యమైన వ్యక్తుల ఫోన్‌ను పోలీసులు ట్రాకింగ్‌లో పెడతారు. లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసి వ్యక్తి ఫొటో, చిరునా మాలతో కరపత్రాలను ముద్రించి బస్‌ స్టేషన్, రైల్వే స్టేషన్, బహిరంగ ప్రదేశాల్లో అంటిస్తారు. దర్పణ్‌ యాప్, పోలీసు వెబ్‌సైట్లలో వ్యక్తి ఫొటో, వివరాలను అప్‌లోడ్‌ చేస్తారు. అదృశ్యమైన వ్యక్తికి శత్రువులు, అప్పులు ఇచ్చినవాళ్లు ఉన్నారా ఆరా తీసి వారిపై నిఘా పెడుతుంటారు. 

ట్రేస్‌ చేసి పట్టుకుంటున్నాం 
పురుషులు చిన్న చిన్న గొడవలతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటారు. కొంతకాలం తర్వాత వాళ్లే తిరిగి వస్తుంటారు. మిస్సింగ్‌ ఫిర్యాదు అందగానే ప్రత్యేక వ్యవస్థ ద్వారా ట్రేస్‌ చేసి పట్టుకుంటున్నాం.     

– స్టీఫెన్‌ రవీంద్ర పోలీస్‌ కమిషనర్, సైబరాబాద్‌  

మరిన్ని వార్తలు