మాటేసి.. కాటేసి..

11 May, 2022 02:22 IST|Sakshi
ముఢావత్‌ లావణ్య 

గిరిజన వివాహితపై లైంగికదాడి.. ఆపై హత్య 

రాజధాని సరిహద్దులో దారుణం 

12గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు? 

చౌటుప్పల్‌ రూరల్‌: ఓ మృగాడి కర్కశత్వానికి మరో మహిళ బలైంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా నుంచి పొట్టచేత పట్టుకొని వచ్చిన గిరిజన వివాహిత ఉసురు తీశాడు. లైంగికదాడి చేసి కొట్టి చంపాడు. హైదరాబాద్‌ నగర శివార్లలోని రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల సరిహద్దులో సోమవారం ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలి భర్త, పోలీసుల నుంచి విశ్వనీయంగా తెలిసిన వివరాల మేరకు.. నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడూరు మండలం కర్రెన్నబండ తండాకు చెందిన ముఢావత్‌ కృష్ణ, లావణ్య అలియాస్‌ శ్రావ్య(28)కు ఆరేళ్ల క్రితం పెళ్లయ్యింది.

అక్కడే కూలీ పని చేసుకుంటూ పొట్టపోసుకునేవారు. సంతానం కలగకపోవడంతో హైదరాబాద్‌లో పనిచేసుకుంటూ, ఆస్పత్రుల్లో చూపించుకోవచ్చని 2 నెలల క్రితం వలస వచ్చారు. చౌటుప్పల్‌ మండలం తుఫ్రాన్‌పేట శివారులోని గోడౌన్‌లో వాచ్‌మెన్‌గా పనికి కుదిరారు. గోదాం వెనకాల గదుల్లో ఉంటున్నారు. ఇద్దరూ ఒకే పని చేస్తే పూటగడవదని, లావణ్యను గోదాం వద్ద ఉంచి, అశోకా ఇంజనీరింగ్‌ కళాశాలలో కృష్ణ వాచ్‌మన్‌గా ఏప్రిల్‌ 12న చేరాడు.  

లావణ్య ఒంటరిగా ఉండటం చూసి.. 
గోదాంలో లావణ్య పొద్దంతా ఒంటరిగా ఉంటోంది. కృష్ణ ఉదయం 7.40గం.కు కాలేజీకి వెళ్లి రాత్రి 8.40గం.కు వచ్చేవాడు. గోదాం వెనుక సిమెంట్‌ పలకలు తయారు చేసే కంపెనీ ఉంది. ఇందులో ఉన్న గదుల్లో వర్కర్లతో పాటు ఇతరులూ అద్దెకు ఉంటూ మేస్త్రీ పనిచేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన హరీశ్‌ ఇక్కడ ఉంటూ సుతారి పనిచేస్తున్నాడు.

గోదాంలో లావణ్య ఒంటరిగా ఉండటం చూసి కన్నేశాడు. ఈ క్రమంలో సోమవారం పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నాడు. ఆమె బాత్‌రూంకు రావడం గమనించి లైంగికదాడికి యత్నించాడు. ఆమె తిరస్కరించినా లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఇటుకలు, కర్రతో తలపై దారుణంగా కొట్టి చంపేశాడు. ఆమె మెడలో ఉన్న పుస్తెలను, 8 తులాల వెండి పట్టాగొలుసులను ఎత్తుకెళ్లాడు. 

పోలీసుల అదుపులో నిందితుడు?.. 
కృష్ణ సోమవారం రాత్రి డ్యూటీ దిగి 8.40గం.కు ఇంటికొచ్చాడు. లావణ్య కోసం వెతకగా.. బూత్‌ రూం పక్కనే గడ్డివాము వద్ద అనుమానాస్పద స్థితి లో మృతిచెంది ఉంది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు రాత్రి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చెప్పులు మినహా ఆధారాలేవీ లభ్యంకాలేదు. మృతదేహాన్ని చౌటుప్పల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

అత్యాచారం, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తును మొదలుపెట్టారు. మంగళవారం చౌటుప్పల్‌ ఏసీపీ ఉదయ్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి రంగంలో కి దిగారు. దొరికిన ఆధారంతో, సుతారీ మేస్త్రీల సాయంతో, తుఫ్రాన్‌పేట శివారులో సుతారీ పనిచేస్తున్న హరీశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అతడి గది నుంచి లావణ్య పుస్తెలను, వెండి పట్టాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. 

మరిన్ని వార్తలు