ముక్కలు ముక్కలుగా తండ్రిని నరికి.. 

21 May, 2022 02:47 IST|Sakshi

భూమి పూజ పేరిట డ్రమ్ములో పెట్టి పూడ్చేసిన కొడుకు

ఆస్తి కోసం చెన్నైలో దారుణం

సాక్షి, చెన్నై: ఆస్తి కోసం కన్న కొడుకే తండ్రిని దారుణంగా హతమార్చాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఓ డ్రమ్ములో పడేశాడు. కొత్త పరిశ్రమకు భూమిపూజ చేస్తున్నట్లు బిల్డప్‌ ఇచ్చి, అందరూ చూస్తుండగానే ఆ డ్రమ్మును పాతేశాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. చెన్నైలోని వలసరవాక్కం ఆర్కాడుసాలైకు చెందిన కుమరేశన్‌ (80) కేంద్ర రిటైర్డ్‌ ఉద్యోగి. ఆయన భార్య దాక్షాయిణి ఇటీవల మరణించింది. ఆయనకు కుమారుడు గుణశేఖరన్‌ (50)తోపాటు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

వీరికి వివాహాలయ్యాయి. కుమారుడు గుణశేఖరన్‌ ఇంట్లో కుమరేశన్‌ ఉంటున్నాడు. అదే ఇంటి పైఅంతస్తులో కుమార్తె కాంచనమాల  ఉంటోంది. రెండు రోజులుగా తండ్రి కనిపించకపోవడంతో కాంచనమాల.. గుణశేఖరన్‌ భార్య, పిల్లల్ని నిలదీసింది. వారు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానం వచ్చి పోలీసుల్ని ఆశ్రయించింది. విచారణలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది.

గుణశేఖరన్‌ చెప్పిన కట్టుకథ
కుమరేశన్‌ పేరిట ఉన్న ఇళ్లు, స్థలాలు తన పేరున రాయాలని గుణశేఖరన్‌ పదే పదే తండ్రిపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అదే సమయంలో గుణశేఖరన్‌ అజ్ఞాతంలోకి వెళ్లడంతో అనుమానాలకు బలం చేకూరింది. విచారణలో కుమరేశన్‌ను గుణశేఖరన్‌ హతమార్చినట్టు తేలింది. కావేరి పాక్కంలో గుణశేఖరన్‌ చేపట్టిన టైల్స్‌ కట్టింగ్‌ పరిశ్రమ నిర్మాణంజరుగుతున్న ప్రదేశంలో శుక్రవారం పోలీసులు గాలించారు.

నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన సమయంలో గుణశేఖరన్‌ ఓ డ్రమ్మును పాతి పెట్టాడని అక్కడి వారు చెప్పారు. వ్యాపారం బాగా సాగేందుకు మంత్రగాడు ఇచ్చిన కొన్ని వస్తువులు డ్రమ్ములో పెట్టి పూడ్చుతున్నట్లుగా కట్టు కథ చెప్పి నమ్మించాడని తేలింది. పోలీసులు డ్రమ్మును వెలికితీసి అందులోని మృతదేహం భాగాలను పోస్టుమార్టంకు తరలించారు.

మరిన్ని వార్తలు