షట్టర్‌ పగలగొట్టి.. గ్యాస్‌ కట్టర్‌తో లాకర్‌ తెరిచి..

5 Jul, 2022 02:08 IST|Sakshi
గ్యాస్‌ కట్టర్‌తో కటింగ్‌ చేసిన లాకర్, కాలిపోయిన నగదు, దొంగలు వదిలేసిన మాస్కు

నిజామాబాద్‌ జిల్లాలో సినీ ఫక్కీలో బ్యాంకుకు కన్నం

మెండోరా మండలం బుస్సాపూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దొంగల బీభత్సం

రూ. 4.15 కోట్ల విలువ చేసే 8.30 కిలోల బంగారంతో ఉడాయింపు

బాల్కొండ: నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆదివారం అర్ధరాత్రి దొంగలు సినీ ఫక్కీలో భారీ చోరీకి పాల్పడ్డారు. మొహాలు కనపడకుండా బొమ్మ మాస్కులు.. వచ్చీ రాగానే సీసీ కెమెరాల ధ్వంసం, డీవీఆర్‌ రికార్డర్‌ తొలగింపు, అలారం మోగకుండా వైర్ల కటింగ్, బ్యాంకు స్ట్రాంగ్‌ రూమ్‌ లోని లాకర్‌ను తెరిచేందుకు గ్యాస్‌ కట్టర్‌ వాడకం, పోలీసులకు చిక్కకుండా ఆనవాళ్ల చెరిపివేత వంటి చర్యలతో పక్కాగా ప్లాన్‌  చేశారు. లాకర్‌ను తెరిచే క్రమంలో మంటలు చెలరేగి నగదు కాలిపోవడంతో చివరకు అందులోని రూ. 4.15 కోట్ల విలువైన బంగారంతో ఉడాయించారు.

పక్క భవనం ద్వారా...: బస్సాపూర్‌ మీదుగా వెళ్లే 44వ నంబర్‌ జాతీయ రహదారికి 20 మీటర్ల దూరంలో ఉన్న ఓ భవనం మొదటి అంతస్తులో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉంది. మొదట దొంగలు బ్యాంకు పక్కనే ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయ ఆవరణలోకి ప్రవేశించారు. ఎవరికీ కనిపించకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రహరీకి ట్రాక్టర్‌ కేజ్‌వీల్‌ను తీసుకెళ్లి అడ్డం పెట్టారు. ప్రహరీకి రంధ్రాలు కొట్టి కార్యాలయ ఆవణలోకి ప్రవేశించిన దొంగలు... అక్కడి నుంచి కుర్చీ వేసుకొని బ్యాంకు మొదటి అంతస్తు మెట్లపైకి ఎక్కారు.

ముందుగా సీసీ కెమెరాలను, తర్వాత షట్టర్‌ తాళాలను పగలగొట్టి షట్టర్‌ను ఒక అడుగు మేర పైకెత్తి లోపలకు ప్రవేశించారు. బ్యాంకులోని అలారం మోగాకుండా వైర్లు తెంపారు. సీసీ కెమెరాల డీవీఆర్‌ను తొలగించాక గ్యాస్‌ కట్టర్‌తో లాకర్‌ను ముక్కలుగా కట్‌ చేశారు. అయితే ఈ క్రమంలో మంటలు రావడంతో లాకర్‌లో ఉన్న రూ. 7.30 లక్షల (బ్యాంకు అధికారుల లెక్క ప్రకారం) నగదు కాలి బూడిదైంది. కొన్ని పత్రాలు కూడా కాలిపోయాయి. కానీ లాకర్‌లో చిన్నచిన్న బాక్సుల్లో మొత్తం 8 కిలోల 30 తులాల బంగారం కనిపించడంతో దాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు.

ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం చోరీకి గురైన బంగారం విలువ రూ. 4.15 కోట్లు ఉంటుందని బ్యాంకు సిబ్బంది తెలిపారు. చోరీకి గురైన బంగారం రుణాల కోసం కుదువ పెట్టిందేనని చెప్పారు. బ్యాంకులోని చిన్న లాకర్‌ను కట్‌ చేసిన దొంగలు పక్కనే ఉన్న పెద్ద లాకర్‌ను మాత్రం ముట్టుకోకపోవడం గమనార్హం. సిలిండర్‌లో గ్యాస్‌ అయిపోవడం వల్లో లేక మంటలు ఎక్కువగా చెలరేగడంతో వదిలేసి వెళ్లారో తెలియరాలేదు. ఒకవేళ పెద్ద లాకర్‌ను కట్‌ చేసి ఉంటే అందులో వినియోగదారులు దాచుకున్న సుమారు రూ. 6 కోట్ల విలువైన బంగారం పోయేదని బ్యాంకు సిబ్బంది పేర్కొన్నారు.

ఆనవాళ్లు చెరిపేసి.. : చోరీ అనంతరం దొంగలు తమ ఆనవాళ్లు చిక్కకుండా వెంట తెచ్చుకున్న పాతగుడ్డలతో పాదముద్రలను చెరిపేసి వెళ్లినట్లు క్లూస్‌ టీం పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసు జాగిలాలు బ్యాంకు నుంచి జాతీయ రహదారి వెంట ఉన్న సోన్‌పేట్‌ రోడ్డు వరకు కిలోమీటర్‌ దూరం వరకు వెళ్లి తిరిగి బ్యాంకు వైపే వచ్చాయి. ఘటనాస్థలంలో కోతి బొమ్మ మాస్కు, హ్యాక్‌సా బ్లేడ్‌తోపాటు గ్యాస్‌ సిలిండర్, ఇతర పరికరాలు, ఒక హిందీ న్యూస్‌ పేపర్‌ (బరేలీ) లభించాయి. దీంతో దొంగలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా పోలీసులు భావిస్తున్నారు.

బ్యాంకును పరిశీలించిన సీపీ..: సోమవారం ఉదయం బ్యాంకుకు వచ్చిన సిబ్బంది షట్టర్‌ పగులగొట్టి ఉండటాన్ని గమనించి మెండోరా ఎస్సై శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసు కమిషనర్‌ నాగరాజు అలర్ట్‌ బెల్‌ ఎందుకు మోగలేదని బ్యాంక్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌గౌడ్‌ను అడిగి తెలుసుకున్నారు. అలర్ట్‌ అలారం పనిచేస్తోందా లేదా అని టెక్నీషియన్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దొంగలు జాతీయ రహదారుల వెంబడి ఉన్న బ్యాంకుల్లో చోరీలు చేసే అంతర్రాష్ట్ర ముఠాగా అనుమానిస్తున్నట్లు చెప్పారు.  

మరిన్ని వార్తలు