వాడిని వదలొద్దు నాన్నా! 

16 Nov, 2022 01:43 IST|Sakshi

అమర ప్రేమికులంటూ ఫొటో వైరల్‌ చేసిన యువకుడు 

మనస్తాపంతో యువతి బలవన్మరణం 

పరువు తీసినవాడిని వదలొద్దని సూసైడ్‌ నోట్‌ 

గద్వాల క్రైం: న్యూడ్‌ కాల్స్‌ వ్యవహారం మరవక ముందే గద్వాల మండలంలో మరో దారుణం మంగళవారం చోటు చేసుకుంది. బంధువైన ఓ యువకుడితో దిగిన ఫొటో ఓ డిగ్రీ విద్యార్థిని చావుకు కారణమైంది. అనంతపురం గ్రామానికి చెందిన లక్ష్మన్న, నాగమ్మకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. పెద్ద కుమార్తె మేఘలత అలియాస్‌ మేఘన(21) జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మహిళాడిగ్రీ కళాశాలలో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతోంది.

అదే గ్రామానికి చెందిన శివకుమార్‌(24) తమకు బంధువు కావడంతో 2019లో కలిసి ఫొటో దిగారు. ఈ క్రమంలో శివకుమార్‌ ప్రేమిస్తున్నట్లు చెప్పగా.. యువతి నిరాకరించడంతో ఈ నెల 6న ఉరేసుకొని చనిపోయాడు. అయితే శివకుమార్‌ స్నేహితుడు అలీబాబు ఆ ఫొటోను వీడియోగా చిత్రీకరించి అమర ప్రేమికులంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. దీంతో మానసిక వేదనకు గురైన యువతి మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి కిందకి దించగా అప్పటికే మృతిచెందింది.  

అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి...
చనిపోయే ముందు యువతి రాసిన సూసైడ్‌ నోట్‌ పోలీసుల చేతికి చిక్కింది. అందులో ‘అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి... నేను ఎవరినీ ప్రేమించలేదు.. 2019లో నేను, శివకుమార్‌ ఓ ఫొటో దిగగా దాన్ని అడ్డం పెట్టుకొని నాలుగేళ్లుగా వేధించాడు. మీకు చెబితే లేనిపోని గొడవలవుతాయని సైలెంట్‌గా ఉన్నా.

వాడు చనిపోయాక తోక శాలన్న కుమారుడు అలీబాబు ఆ ఫొటోను వీడియోగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి.. నన్ను బ్లాక్‌మెయిల్‌ చేయడంతోపాటు మన పరువు తీశాడు. దీంతో నేను ఎనిమిది రోజులుగా ఎవరికీ మొహం చూయించలేకపోతున్నా.. వాడిని మాత్రం వదలకు నాన్నా. చెల్లిని, తమ్ముడిని బాగా చూసుకో.. ఐ లవ్‌ యూ నాన్న.. ఐ లవ్‌ యూ అమ్మ..’అని రాసి ఉంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు