ఏలూరు ఆంధ్రా హాస్పిటల్‌పై క్రిమినల్‌ కేసు

16 May, 2021 03:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలు.. రోగుల నుంచి అధిక ఫీజుల వసూలు

ఏలూరు టౌన్‌: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఆంధ్రా హాస్పిటల్‌లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందం తనిఖీలు చేసింది. రోగుల నుంచి నిర్దేశిత ధరల కంటే అధికంగా ఫీజులు వసూలు చేసినట్లు ఈ సందర్భంగా నిర్ధారించింది. హాస్పిటల్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయించింది. వివరాలు.. ఏలూరు ఆర్‌ఆర్‌ పేటలోని ఆంధ్రా హాస్పిటల్‌లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై రీజనల్‌ విజిలెన్స్‌ అధికారి ఎస్‌.వరదరాజు వెంటనే స్పందిస్తూ.. తనిఖీలకు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందంలోని విజిలెన్స్‌ డీఎస్పీ కేవీ రమణ, సీఐ యూజే విల్సన్, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రవితేజ, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌కే అబిద్‌ ఆలీ శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు హాస్పిటల్‌లో తనిఖీలు చేశారు.

ఆరోగ్య శ్రీ పథకానికి అర్హులైన కరోనా బాధితుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేసినట్లు నిర్ధారించారు. ఒక రోగి నుంచి 7 రోజులకు రూ.1.91 లక్షలు, మరొకరి నుంచి ఐదు రోజులకు గానూ రూ.1.28 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. ఇక హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయిన రోగులకు సంబంధించి కేస్‌షీట్‌లను పరిశీలించగా డిశ్చార్జ్‌ తేదీనే లేదు. ఆరోగ్య శ్రీ కార్డులను నిరాకరించి మరీ.. పలువురి నుంచి అధికంగా ఫీజులు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. సంబంధిత రోగులకు సంబంధించి ఏ విధమైన బిల్లులు లేకుండా చేసినట్లు అధికారులు గుర్తించారు. రోగులకు ఆరోగ్య శ్రీ కింద వైద్యం చేయలేదని అధికారులు నిర్ధారించారు. వీటన్నింటిపై ఏలూరు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్‌ హెచ్చరించింది. 

మరిన్ని వార్తలు