వయసు 75 ఏళ్లు.. 80 మంది ప్రాణాలు తీసింది

13 Jun, 2021 16:12 IST|Sakshi

కంపాలా(ఉగాండా): ఒకప్పుడు అల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్‌ పేరు చెబితే పాశ్చాత్య దేశాలు, అమెరికాకు వెన్నులో వణుకు పుట్టేది. అయితే ఉగాండాలోని విక్టోరియా సరస్సులో ఉండే ఒసామా బిన్ లాడెన్ అనే ఓ మొసలి(75) అక్కడి పిల్లలకు, పెద్దలకు దశాబ్దాలపాటు వెన్నులో వణుకు పుట్టించింది.  ఒసామా 1991 నుంచి 2005 మధ్య కాలంలో దాదాపు 16 భారీ సరిసృపాలను తినేసింది. అంతేకాకుండా లుగాంగా అనే గ్రామంలోని జనాభాలో పదోవంతు మంది కనిపించకుండా పోయారు. కొన్ని నివేదికల ప్రకారం.. ఒసామా ఇప్పటివరకు గ్రామంలోని 80 మందికి పైగా స్థానికులను పొట్టన బెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఫిషింగ్ బోట్ల క్రింద దాక్కుని సరస్సులో నీటి కోసం వచ్చే పిల్లలను పట్టుకునేదని స్థానికుల కథనం. ఇక మత్స్యకారులు వేటకు బయలు దేరినప్పుడు వారిపై దాడి చేసి చంపేసేది.

భయానక ఘటన:
పాల్ కైవాల్యాంగా మాట్లాడుతూ.. “మేము చేపలు పడుతున్నాం. అయితే ఓ రోజు ఒసామా నీటిలో నుంచి పడవలో దూకింది.  దాంతో నేను కూర్చున్న పడవ వెనుక భాగం మునిగిపోయింది. ఆ భయంకరమైన మొసలి నా తమ్ముడు పీటర్ కాళ్లను పట్టుకుని​ నీటిలోకి ఈడ్చుకుపోయింది. పీటర్ అరుస్తూ ఐదు నిమిషాల పాటు దానితో పోరాడాడు. అతన్ని కాపాడటానికి నేను ఎంత ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది.  కొన్ని రోజుల తరువాత అతని తల, చెయ్యి నీటిలో తేలుతూ కనిపించాయి.’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా గ్రామస్తులు 2005లో అధికారులను సహాయం కోరారు. 50 మంది స్థానిక పురుషులు, వన్యప్రాణి అధికారుల సహాయంతో ఆ భారీ మొసలిని పట్టుకున్నారు. 

ఇంకా ఉంది:
అయితే ఒసామా కథ అక్కడితో ముగిసిపోలేదు. గ్రామస్తులు ఆ మొసలిని వెంటనే చంపాలని అనుకున్నారు. కానీ ఉగాండాలో దీనికి అనుమతి లేదు.  ఒసామాకు కూడా జీవించే హక్కు ఉందని, శిక్షగా చంపలేమని అధికారులు తెలిపారు. చంపకుండా ఈ మొసలిని ఉగాండాలోని మొసళ్ల పెంపకం కేంద్రానికి ఇచ్చారు. ఈ మొసలి ద్వారా కలిగే సంతానం తోలుతో  హ్యాండ్‌బ్యాగులు తయారు చేసి ఇటలీ, దక్షిణ కొరియాకు ఎగుమతి చేయవచ్చని భావించారు. కాగా ఒసామా వచ్చినప్పటి నుంచి ఈ సంతానోత్పత్తి కేంద్రం పర్యాటకులతో రద్దీగా ఉంది. ఇక్కడ ప్రస్తుతం 5000 మొసళ్ల దాకా ఉన్నాయి.

చదవండి: హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి.. మరో 132 మంది

మరిన్ని వార్తలు