అర్ధరాత్రి కార్లు, బైకులతో ఛేజింగ్‌.. కాల్పులు జరిపి రూ.3 కోట్లు చోరీ

27 Aug, 2022 11:39 IST|Sakshi

ముంబై: డబ్బులు తీసుకెళ్తున్న వాహనాన్ని ఛేజింగ్‌ చేసి దొంగలు లూటీ చేసే దృశ్యాలు చాలా సినిమాల్లో చూశాం. అయితే, నిజ జీవితంలోనూ అలాంటి సంఘటనే జరిగింది. సినిమాను తలదన్నేలా ఛేజింగ్‌లు, కాల్పులు ఇందులో హైలైట్‌. నగదుతో కారులో వెళ్తున్న ఇద్దరు బాధితులను చితకబాది రూ.3.6కోట్లు కొట్టేశారు కొందరు దుండగులు. సినిమా స్టైల్‌ జరిగిన ఈ దోపిడి మహారాష్ట్రలోని పుణెలో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

రూ.3కోట్ల 60 లక్షల నగదుతో భవేశ్‌ కుమార్‌ పటేల్‌, విజయ్‌ భాయ్‌ అనే ఇద్దరు వ్యక్తులు పుణె-సోలాపూర్‌ హైవేపై వెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఓ ముఠా ఆ డబ్బును ఎలాగైనా కొట్టేయాలని వారి వెంటపడింది. స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద వారి కారును నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడ్లతో వచ్చి ఆపేందుకు ప్రయత్నించగా స్పీడ్‌ పెంచారు. దీంతో రెండు కార‍్లు, రెండు ద్విచక్రవాహనాలపై డబ్బుతో వెళ్తున్న వారి కారును కొన్ని కిలోమీటర్ల పాటు ఛేజ్‌ చేశారు దుండగులు. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన వారు కారుపై కాల్పులు చేపట్టారు. ఆ తర్వాత కారును ఇందాపుర్‌ సమీపంలో ఆపి బాధితులను చితకబాదారు. నగదుతో అక్కడి నుంచి ఉడాయించారు.

బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయితే, భవేశ్‌ కుమార్‌ పటేల్‌, విజయ్‌భాయ్‌ అంత డబ్బును కారులో ఎందుకు తరలిస్తున్నారనే విషయం తెలియలేదని, అది హవాలా రాకెట్‌కు సంబంధించినదై ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:  సినిమాను తలపించిన లవ్‌స్టోరీ.. పెళ్లి.. కిడ్నాప్‌.. ఛేజింగ్‌..

మరిన్ని వార్తలు