అపహరణకు గురైనవాడే నేరస్తుడు, ఫిర్యాదుదారుడే నిందితుడు

27 Mar, 2022 17:04 IST|Sakshi

న్యూఢిల్లీ: మనం ఎన్నో విచిత్రమైన కేసులు గురించి విన్నాం. కానీ ఈ కేసు అత్యంత విచిత్రమైంది. పోలీసులకు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నప్పుడూ అత్యంత ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అత్యంత విస్తుపోయే విషయమేమిటంటే..అపహరణకు గురైనవాడిపై  గతంలో చీటింగ్‌ కేసు నమోదైంది. ఇందులో మరో ట్విస్ట్‌ ఏంటంటే నిందితులే బాధితులుగా మారడం. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే....గ్రేటర్ నోయిడాలోని కస్నా ప్రాంతంలో వ్యాపారవేత్త అమిత్ కుమార్ కిడ్నాప్‌కి గురయ్యారు. వ్యాపారవేత్త కారుని ఒక రౌండ్‌అబౌట్ వద్ద ఆపి, అతనిని, అతని డ్రైవర్ కుందన్‌ను కొట్టి హెచ్చరిక కాల్పులు జరిపారు. అనంతరం కుమార్‌తో కలిసి వేగంగా వెళ్లిపోయారు. అయితే వ్యాపారవేత్త డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమెదు చేసుకుని విచారించడం మొదలు పెట్టారు.

ఈ మేరకు ఈ ఘటనలోని ప్రధాన నిందితుడుగా పర్వీందర్ తెవటియాని గుర్తించి అరెస్టు చేయడమే కాకుండా నేరానికి ఉపయోగించిన కారు, పిస్టల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఈ కేసు తాలుకా షాకింగ్‌ విషయాలు విని ఆశ్చర్యపోయారు. అపహరణకు గురైన వ్యాపారవేత్త పై సుమారు రెండున్నర కోట్ల చీటింగ్ కేసు నమైదైందని గుర్తించారు.

అయితే ఇక్కడ అసలు ట్విస్ట్‌ ఏంటంటే.. ఆ వ్యాపారవేత్త మీద ఫిర్యాదు చేసినవాడే అపహరించాడని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో పోలీసులు మరింత లోతుగా విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. "వ్యాపారవేత్త అమిత్ కుమార్ తనకు మంత్రిత్వ శాఖలో పరిచయాలు ఉన్నాయని చెప్పి నిందితుడు తెవతియాకి భూమికి సంబంధించిన సమస్యలో సాయం చేశాడు.

ఆ తర్వాత తనకు హోమంత్రితో ఉన్న పరిచయాలతో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇప్పించగలనని చెప్పాడు. దీంతో తెవతియా అతని కూతురు, పలువురు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సుమారు రెండున్నర కోట్లు ఈ వ్యాపారవేత్తకు ఇచ్చారు. ఏడాది గడుస్తున్న ఉద్యోగాలు రాకపోడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తేవటియా కుమార్ కారుకు జీపీఎస్ సిస్టమ్‌ను అమర్చి, అతడిని అనుసరించి మరీ అపహరించాడు" అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరూ జైల్లోనే ఉన్నారు.

(చదవండి: ఇరు కుటుంబాల మధ్య పాతకక్షలు...హంతకుడిగా మారిన పెళ్లి కొడుకు)

మరిన్ని వార్తలు