పొట్ట విప్పి చూడ డ్రగ్స్‌ ఉండు!

5 May, 2022 05:42 IST|Sakshi

డ్రగ్‌ క్యాప్సుల్స్‌ను మింగి వచ్చిన టాంజానియా వాసి 

గత నెల 26న అదుపులోకి తీసుకున్న కస్టమ్స్‌ అధికారులు 

6 రోజులు ఆసుపత్రిలో ఉంచి.. 108 క్యాప్సుల్స్‌ తీసిన వైద్యులు 

రూ.11.53 కోట్ల విలువైన 1.38 కేజీల హెరాయిన్‌ స్వాధీనం 

శంషాబాద్‌: మాదకద్రవ్యాలను క్యాప్సుల్స్‌ రూపంలో ప్యాక్‌ చేసి, కడుపులో దాచుకుని స్మగ్లింగ్‌ చేస్తున్న విదేశీయులు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుసగా పట్టుబడుతున్నారు. గత నెల 21న ఒకరిని టాంజానియా జాతీయుడిని పట్టుకున్న డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు రూ.11.57 కోట్ల విలువైన కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. గత నెల 26న టాంజానియాకు చెందిన మరో వ్యక్తిని పట్టుకున్నామని, ఆరు రోజుల చికిత్స అనంతరం రూ.11.53 కోట్ల విలువైన హెరాయిన్‌ క్యాప్సుల్స్‌ రికవరీ చేశామని కస్టమ్స్‌ అధికారులు బుధవారం ప్రకటించారు. డ్రగ్స్‌ మాఫియా వాళ్లు 1.38 కేజీల హెరాయిన్‌ను పారదర్శకంగా ఉండే టేప్‌తో 108 క్యాప్సుల్స్‌గా మార్చారన్నారు. టాంజానియాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తిని క్యారియర్‌గా మార్చుకుని అతడికి భారత్‌ రావడానికి టూరిస్ట్‌ వీసా ఇప్పించారని చెప్పారు. అతడితో హెరాయిన్‌ క్యాప్సుల్స్‌ను మింగించి ఎథిహాద్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో అబుదాబి మీదుగా హైదరాబాద్‌ పంపినట్లు తెలిపారు. 

ప్రయాణికుల జాబితా వడపోసి.. 
కస్టమ్స్‌ అధికారులు అనునిత్యం విదేశాల నుంచి ప్రధానంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల జాబితాను సేకరించి ప్యాసింజర్స్‌ ప్రొఫైలింగ్‌ విధానంతో వడపోస్తారు. గత నెల 26న వచ్చిన ప్యాసింజర్స్‌ జాబితాను ఇలాగే వడపోయగా టాంజానియా జాతీయుడిపై అనుమానం వచ్చింది. శంషాబాద్‌ విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్న ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ప్రాథమిక విచారణ చేసింది. తాను హెరాయిన్‌ క్యాప్సుల్స్‌ మింగి వస్తున్నానని, రెండు మూడు రోజుల్లో వీటిని తన వద్దకు వచ్చే రిసీవర్లకు అందించాల్సి ఉందని అంగీకరించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్‌ అధికారులు ఆరు రోజులు ఆస్పత్రిలో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో 108 క్యాప్సుల్స్‌ బయటకు వచ్చేలా చేశారు. వీటిలో ఉన్న 1.38 కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ డ్రగ్స్‌ ఉత్తరాదికి వెళ్లాల్సి ఉందని కస్టమ్స్‌ అధికారులు అనుమానిస్తున్నారు. శంషాబాద్‌ లో గత 15 రోజుల్లోనే మొత్తం రూ.113.47 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుబడ్డాయి.  

మరిన్ని వార్తలు