ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 61కిలోల బంగారం పట్టివేత.. ఏడుగురు అరెస్ట్‌

13 Nov, 2022 20:47 IST|Sakshi

ముంబై: విదేశాల నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠాల గుట్టురట్టు చేశారు ముంబై కస్టమ్స్‌ అధికారులు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ స్థాయిలో బంగారం పట్టుకున్నారు. రెండు వేరు వేరు సంఘటనల్లో మొత్తం 61 కిలోల బంగారాన్ని సీజ్‌ చేశారు. దాని విలువ సుమారు రూ.32 కోట్లు ఉంటుందని తెలిపారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌ కస్టమ్స్‌ విభాగం చరిత్రలో ఒక్కరోజులో సీజ్‌ చేసిన విలువలో ఇదే అత్యధికమని తెలిపారు.

ఈ సంఘటన గత శుక్రవారం జరిగినట్లు అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. మొదటి ఆపరేషన్‌లో టాంజానియా నుంచి వచ్చిన నలుగురు భారతీయులను తనిఖీ చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన బెల్టుల్లో 1 కేజీ బంగారం బిస్కెట్లను దాచి తీసుకొచ్చారు. మొత్తం రూ.28.17 కోట్లు విలువైన యూఏఈ తయారీ గోల్డ్‌ బార్స్ 53 లభ్యమయ్యాయి. నలుగురిని అరెస్ట్‌ చేసి జుడీషియల్‌ కస్టడీకి తరలించారు. 

మరో ఆపరేషన్‌లో 8 కిలోలు సుమారు రూ.3.28 కోట్ల విలువైన బంగారం సీజ్‌ చేశారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద తనిఖీలు చేయగా ఈ బంగారం బయటపడింది. ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి కలిసి బంగారాన్ని మైనం రూపంలో చేసి తీసుకొస్తున్నట్లు గుర్తించారు. దానిని జీన్స్‌లో పెట్టి తీసుకొస్తున్నారని తెలిపారు. 

ఇదీ చదవండి: Prashant Kishor: ఎన్నికల్లో పోటీపై ప్రశాంత్‌ కిషోర్‌ క్లారిటీ.. ఏమన్నారంటే?

మరిన్ని వార్తలు