ఐటీ అధికారులకూ ‘సైబర్‌’ స్ట్రోక్‌

12 Jan, 2023 04:36 IST|Sakshi

గిఫ్ట్‌ కూపన్‌ పేరిట రూ.1.10 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

ఉన్నతాధికారి డీపీతో వాట్సాప్‌ ద్వారా ఎర

సైబర్‌ నేరస్తుల పనేనని తేలడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సైబర్‌ నేరగాళ్లు ఎవర్నీ వదలటం లేదు. ఆదాయ పన్ను శాఖ అధికారులకు రూ.1.10 లక్షలకు టోకరా వేశారు. విశాఖపట్నానికి చెందిన ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఉన్నతా­ధికారి పేరిట అమెజాన్‌ గిఫ్ట్‌ కూపన్లు పంపాలంటూ మెసేజ్‌ పంపిన సైబర్‌ నేరగాళ్లు.. వచ్చిన గిఫ్ట్‌కార్డు నుంచి ఆ మొత్తాన్ని వెంటనే తమ ఖాతాలోకి జమ చేసుకున్నారు. రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌ నుంచి నడి­పిన ఈ వ్యవహారంపై విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేష­న్‌లో కేసు నమోదైంది. ప్రత్యేక టీమ్‌ను ఏర్పా­టు చేసిన విశాఖ పోలీసులు దర్యాప్తు చేప­ట్టారు. 

వాట్సాప్‌ డీపీతో బోల్తా
ఢిల్లీ కేంద్రంగా విధులు నిర్వర్తించే ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ పంపినట్టుగా విశాఖ­లోని ఐటీ శాఖ అధికారికి ఇటీవల వాట్సాప్‌లో ఓ మెసేజ్‌ వచ్చింది. సదరు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ ఫొటో డీపీగా ఉన్న ఫోన్‌ నంబరు నుంచి.. అమె­జాన్‌ గిఫ్ట్‌ కూపన్ల రూపంలో రూ.1.10 లక్షలను తనకు అత్యవసరంగా పంపాలని ఆ మెసేజ్‌లో ఉంది. ఆ మొత్తాన్ని త్వరలో తిరిగి ఇస్తానని కూడా మెసేజ్‌ చేశారు. ఈ సమాచారాన్ని అందుకున్న అసి­స్టెంట్‌ కమిషనర్‌.. వెంటనే ఆ మొత్తాన్ని ఉన్న­తాధి­కారికి పంపాలంటూ డిప్యూటీ కమిషనర్‌ను కోరారు.

ఈ మేరకు సదరు అధికారి రూ.1.10 లక్షల విలువ చేసే అమెజాన్‌ గిఫ్ట్‌ కూపన్లు కొను­గోలు చేసి ఆ సమాచారాన్ని వాట్సాప్‌ ద్వారా ఆ నంబర్‌కు పంపారు. సదరు సైబర్‌ నేరగాడు వెంటనే ఆ కూపన్లను రెడీమ్‌ చేసుకున్నారు. తాము మోసపోయిన విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న అధికారులు విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విశాఖ పోలీసులు విచారణ చేపట్టారు. సమాచారం పంపిన ఫోన్‌ నంబరు రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌ ప్రాంతం నుంచి వచ్చిందని ప్రాథమికంగా తేల్చారు.

ప్రత్యేక టీమ్‌తో విచారణ
సైబర్‌ నేరగాళ్లు అందరినీ లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. రోజురోజుకీ ఈ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. దీనిని కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ అవగాహన కార్య­క్రమాలు చేపడుతున్నాం. ఇలాంటి నేరాలపై విచారణ కూడా వేగవంతం చేస్తున్నాం. విశాఖ ఆదాయ పన్ను శాఖ అధికారుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశాం. ఒక టీమ్‌ ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నాం. 
– శ్రీకాంత్, విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ 

మరిన్ని వార్తలు