3 అంతస్తుల భవనంలో 200 కంపెనీలు!

1 Dec, 2021 11:01 IST|Sakshi

 నకిలీ చిరునామాతో ‘పెట్టుబడి యాప్స్‌’ నిర్వహణ

బెంగళూరు కేంద్రంగా వ్యవహారం

దర్యాప్తులో గుర్తించిన సైబర్‌ కాప్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఒక్కసారి పెట్టుబడి పెట్టండి.. ప్రతి రోజూ లాభం పొందండి.. అంటూ ప్రచారం చేసి, వర్చువల్‌ యాప్స్‌ ద్వారా సాగుతున్న ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్‌ వ్యవహారంలో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కీలకాంశాన్ని గుర్తించారు. వీటిని నిర్వహిస్తున్న షెల్‌ కంపెనీలు తమ ఉనికి బయటపడకుండా నకిలీ చిరునామాలతో జాగ్రత్త పడుతున్నట్లు తేల్చారు. ఇటీవల ఓ కంపెనీ వ్యవహారంపై ఆరా తీయగా.. బెంగళూరులోని ఓ మూడంతస్తుల భవనం చిరునామాతో 200 షెల్‌ కంపెనీలు నమోదై ఉన్నట్లు తేలింది.  

నగర యువకుడికి గాలం 
ఈ యాప్స్‌ నిర్వాహకులు నగరానికి చెందిన ఓ బాధితుడిని టార్గెట్‌ చేశారు. అతడికి ఫోన్‌ చేసిన ఆగంతకులు తాము నిర్వహించే స్కీముల్లో పెట్టుబడి పెడితే కేవలం కొన్ని రోజుల్లోనే మీ మొత్తం రెట్టింపు అవుతుందని నమ్మించారు. నగర యువకుడు అంగీకరించడంతో స్కీముకు సంబంధించిన ఓ లింకును వాట్సాప్‌ ద్వారా పంపారు. బాధితుడు లింక్‌ను తెరవగా అదో వెబ్‌సైట్‌కు దారితీసింది. అందులో ఉన్న వివిధ స్కీముల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకున్న ఆ యువకుడు ఆన్‌లైన్‌ ద్వారా తొలుత రూ.వేయి పెట్టుబడి పెట్టాడు. ఆ మొత్తం అతడి వర్చువల్‌ ఖాతాలో ఉన్నట్లు వెబ్‌సైట్‌లో కనిపించింది. ప్రతి రోజూ లాభం చేరుతూ పోయి కొన్ని రోజుల్లోనే రూ.2 వేలు అతడి ఖాతాలో ఉన్నట్లు కనిపించింది. ఈ మొత్తాన్ని తన ఖాతాలోకి మార్చుకున్న యువకుడు డ్రా కూడా చేసుకోగలిగాడు.
చదవండి: భార్యతో గొడవ.. కోపంతో కొడుకుని బయటకు తీసుకెళ్లి..

దీంతో ఈ ఇన్వెస్టిమెంట్‌ స్కీమ్‌ నిజమేనని పూర్తిగా నమ్మేశాడు. తన వద్ద ఉన్న డబ్బుతో పాటు స్నేహితుల నుంచి అప్పుగా తీసుకుని వారం రోజుల్లో రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టాడు. ప్రతి సందర్భంలోనూ రెట్టింపు మొత్తం తన వర్చువల్‌ ఖాతాలోకి వచ్చినట్లు కనిపించింది. అవి డ్రా చేసుకోవాలంటే మరికొంత పెట్టుబడి పెట్టాలంటూ చూపించింది. ఇలా భారీ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్‌ పెట్టిన తర్వాత ఆ వెబ్‌సైట్‌ కనిపించకుండా పోయింది. తన ఫోన్‌కు వచ్చిన లింకుల ద్వారా వెబ్‌సైట్‌ను తెరవడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 

సీఏ సహకారం 
కేసును దర్యాప్తు చేసిన అధికారులు బాధితుడి నుంచి నగదు వెళ్లిన ఖాతా బెంగళూరుకు చెందిన ఓ కంపెనీదిగా తేల్చారు. దాని చిరునామాను గుర్తించిన పోలీసులు అక్కడకు వెళ్లి ఆరా తీయగా.. అది ఓ వైద్యుడికి చెందినదిగా తేలింది. మూడు అంతస్తులు ఉన్న ఆ భవనంలో అన్నీ నివాసాలే ఉండడంతో మరింత లోతుగా ఆరా తీశారు. అదే చిరునామాతో మొత్తం 200 షెల్‌ కంపెనీలు రిజిస్టరై ఉన్నట్లు అధికారులు తేల్చారు.

దీనిపై భవన యజమాని అయిన వైద్యుడిని ప్రశ్నించారు. ఆ కంపెనీల సంగతి తనకు తెలియదని చెప్పిన ఆయన రెండేళ్ల క్రితం ఓ మహిళా చార్టెట్‌ అకౌంటెంట్‌ ఆ భవనంలోని ఓ పోర్షన్‌లో అద్దెకు ఉండి వెళ్లినట్లు వెల్లడించారు. దీని ఆధారంగా ముందకు వెళ్లిన పోలీసులు సైబర్‌ నేరగాళ్లకు సహకరించిన ఆమె ఆ చిరునామాతో కంపెనీలు, వాటి ఆధారంగా బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు తేల్చారు. ప్రస్తుతం నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు