నకిలీ ‘ఫేస్‌బుక్‌’తో పారాహుషార్‌! 

1 Sep, 2020 08:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మారుతున్న సమాజంతో పాటు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న ప్రజలకు తగ్గట్టుగానే సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫేస్‌బుక్‌.. ట్విట్టర్‌... ఇలా వివిధ సామాజిక ఖాతాల్లో చురుగ్గా ఉంటూ ముఖ్యంగా ప్రజలు, అభిమానులకు దగ్గరగా ఉంటున్న వీఐపీలు, సెలబ్రిటీల పేర్లను వాడేస్తున్నారు. వారి ఖాతాల్లోని ఫొటోలు, వారు వాడే భాషను అనుకరిస్తూ ఏకంగా వారి పేరుకు దగ్గరగానే నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలను సృష్టిస్తున్నారు. ఇలా వీరు ఆ నకిలీ ఖాతా ద్వారా వారి అభిమానులు, కార్యకర్తలకు ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపిస్తున్నారు. అబ్బా నిజంగా అంతా పెద్దోళ్ల దగ్గరి నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ రావడంతో మరేమీ ఆలోచించకుండానే యాక్సెప్ట్‌ చేస్తున్నారు. ఇదే సైబర్‌ నేరగాళ్లకు వరమవుతోంది. ఆ తర్వాత వారితో వ్యక్తిగత చాటింగ్‌ చేస్తూ దగ్గరవుతున్నారు.

అనంతరం ఫలానా స్నేహితుడి కుమార్తె వేరే రాష్ట్రంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, మీ అభిమాన గాయకినైనా ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తుండటంతో మీ సహకారం కావాలంటూ... ఇలా వివిధ కారణాలతో వారిని నమ్మిస్తున్నారు. ఇది నిజమని నమ్మిన వారు మరో ఆలోచన చేకుండా వారు చెప్పినట్టుగానే నగదును ఫోన్‌ పే, గూగుల్‌ పేల ద్వారా పంపిస్తున్నారు. ఆ తర్వాత అటువైపు నుంచి సరైన సమాధానం లేకపోవడం, వారి పోకడలపై అనుమానం రావడంతో మోసపోయామని సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు పెరిగాయని, స్వీయ అప్రమత్తతోనే మోసం బారిన పడకుండా ఉంటామని పోలీసులు సూచిస్తున్నారు. 

తెలుగు ప్లేబ్యాక్‌ సింగర్‌ పేరుతో... 
అనంతపురం ప్రియాంకనగర్‌కు చెందిన చైతన్య అలియాస్‌ చైతూ ప్రముఖ తెలుగు ప్లేబ్యాక్‌ సింగర్‌ పేరు ఉపయోగించి నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా సృష్టించాడు. ఆమె ఫాలోవర్‌లను పెద్ద సంఖ్యలో తనవైపునకు తిప్పుకున్నాడు. ఇది నిజమని నమ్మినవారు మోసగాడి వలలో పడి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ గాయని అతడు 2020 ఫిబ్రవరిలో అనంతపురం జిల్లా సనపలో తన పేరు మీద ఓ ఈవెంట్‌ను కూడా చేశాడని, తన అభిమానుల నుంచి డబ్బులు కొల్లగొట్టాడని ఫిర్యాదు చేశారు. అలాగే నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలతో తన బంధువుల, అభిమానులను ట్రాప్‌ చేసి మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్‌ డాటా సహకారంతో నిందితుడు చైతన్యను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి చర్లపల్లి జైలుకు తరలించారు. 

ఎంపీ సంతోష్‌కుమార్‌ జోగినిపల్లి పేరుతో... 
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలుడు ఎంపీ సంతోష్‌ కుమార్‌ జోగినిపల్లి పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా సృష్టించి హైదరాబాద్‌లో ఉంటున్న బాధితుడికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. ఇది నిజమని భావించి యాక్సెప్ట్‌ చేసిన బాధితుడితో నిజంగా జో గినిపల్లి సంతోష్‌ అనుకునేలా చాటింగ్‌ చేశాడు. చివరకు బాధితుడి నమ్మాడని తెలిశాక మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న తన స్నేహితుడి కుమార్తెకు డబ్బులు అవసరమంటూ రెండు గూగుల్‌ పే నంబర్ల పంపాడు. ఇది నిజమని బాధితుడు రూ. లక్షను సదరు నంబర్లకు బదిలీ చేశాడు. తీరా ఇది మోసమని తెలిసి ఈ నెల 25న సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఉత్తరప్రదేశ్‌లో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. 

జాగ్రత్తలు ఇలా... 
వీవీఐపీ, వీఐపీ, సినీ ప్రముఖుల పేర్లతో ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు వస్తే నమ్మవద్దు. సరిగా తనిఖీ చేసుకున్నాకే వారి సైన్‌ అనుకరించి ముందుకెళ్లాలి. డబ్బులు అవరమని చాట్‌ చేస్తే మాత్రం సదరు వ్యక్తికి ఫోన్‌ కాల్‌ చేసి నిజమా, కాదా అన్నది నిర్ధారించుకోవాలి. పిల్లలు, వృద్ధులకు వైద్య చికిత్సలకు డబ్బులు అవసరం ఉన్నాయని గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు అడిగితే ట్రాన్స్‌ఫర్‌ చేయవద్దు. వీవీఐపీ, వీఐపీ, సినిమా తారలు, సెలబ్రిటీలు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫేస్‌బుక్, వాట్సాప్‌ ద్వారా డబ్బులు అడగరు. – వై.శ్రీనివాస్‌కుమార్, ఏసీపీ, సైబర్‌క్రైమ్‌

మరిన్ని వార్తలు