విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నా; విలువైన కానుకలు పంపిస్తున్నా

15 Jul, 2021 07:44 IST|Sakshi

బనశంకరి: నిత్యజీవితంలో డిజిటల్‌ సాంకేతికత పాత్ర పెరిగేకొద్దీ సైబర్‌ మోసగాళ్ల పని సులువవుతోంది. అమాయకులను ఎంచుకుని లక్షలాది రూపాయలు దోచుకోవడం సిలికాన్‌ సిటీలో పరిపాటైంది. నిత్యం పదుల సంఖ్యలో సైబర్‌ నేరాల బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.  

నర్సుకు రూ.2 లక్షల నష్టం 
మాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌ ద్వారా పరిచయమైన ఆగంతకుడు, యువతికి రూ.2.07 లక్షలు టోపీ వేశాడు. ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న 30 ఏళ్లు యువతి బెంగాలీ షాదీ డాట్‌కామ్‌లో ఖాతా తెరిచింది. ఓ వ్యక్తి పరిచయమై విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నానని, మీకు ఢిల్లీకి ఖరీదైన కానుకలు పంపించానని చెప్పాడు. కస్టమ్స్‌ ఫీజుల కింద ఆమె నుంచి రూ.2.07 లక్షలు ఆన్‌లైన్లో లాగేసి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. బాధితురాలు దక్షిణ విభాగ సైబర్‌క్రైం పీఎస్‌లో  ఫిర్యాదు చేసింది. 

కేవైసీ అని రూ.27 లక్షలు స్వాహా 
ఓ వృద్దుడు సిమ్‌కార్డు కేవైసీ అనివచ్చిన కాల్‌ను నమ్మి రూ.27 లక్షలు పోగొట్టుకున్నాడు. బాణసవాడిలోని 80 ఏళ్ల రిటైర్డు ఉద్యోగికి ఈ నెల 4వ తేదీన ఓ వ్యక్తి ఫోన్‌ చేసి మీ మొబైల్‌ సిమ్‌కార్డు కేవైసీ చేసుకోవాలని, లేకపోతే బ్లాక్‌ అవుతుందని తెలిపాడు. నిజమేననుకున్న వృద్ధుడు అతడు అడిగిన డెబిట్‌కార్డు సమాచారం ఇవ్వగా, బ్యాంకు ఖాతాలో నుంచి రూ.27 లక్షల నగదు కాజేశాడు. బాధితుడు సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  

రుణం పేరుతో రూ.5.17 లక్షలు  
ఓ వ్యాపారికి ఫోన్‌ చేసిన మోసగాడు ముద్రా రుణ విభాగం నుంచి మాట్లాడుతున్నానని నమ్మించాడు. అతన్ని నమ్మిన వ్యాపారిని రుణ మంజూరు పేరుతో దశలవారీగా రూ.5.17 లక్షలు తమ అకౌంట్లు జమచేసుకున్నారు. రుణం మంజూరు కాకపోవడంతో బాధితుడు సైబర్‌ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.  

నగదు రెట్టింపు అని రూ.7.30 లక్షలు  
కంపెనీలో పెట్టుబడి పెడితే  నిర్ణీత అవధిలోగా రెట్టింపు ఇస్తామని ఆశచూపించిన వంచకులు రూ.7.30 లక్షలు కైంకర్యం చేశారు. దేవనహళ్లి కి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి అల్టా ఎంపైర్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ ప్రతినిధినని ఫోన్‌ వచ్చింది. తమ కంపెనీలు పెట్టుబడి పెడితే త్వరలోనే రెట్టింపు చేసి ఇస్తామని తెలిపారు. నిజమేననుకుని అతడు రూ.1.80 లక్షలు, స్నేహితుల ద్వారా రూ.5.40 లక్షలు పెట్టుబడి పెట్టించాడు. తరువాత ఫోన్‌ కంపెనీ ఫోన్‌ స్విచ్చాఫ్‌ రావడంతో మోసపోయినట్లు గ్రహించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు