నిన్ను డైరెక్టర్‌ చేస్తా.. ఆపై పెళ్లి చేసుకుంటా

20 Mar, 2021 07:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

డేటింగ్‌ సైట్‌లో ఓ వితంతుతో పరిచయం

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు 

అవసరాలంటూ రూ.3 లక్షలు వసూలు 

రాజ్‌వన్స్‌ను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు 

సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరులోని గేటెడ్‌ కమ్యూనిటీల్లో హౌస్‌ కీపింగ్‌ కోసం ఓ సంస్థను నిర్వహిస్తున్నానని నమ్మించి.. అవసరార్థం వ్యాపార విస్తరణ, వైద్యావసరాల కోసమంటూ ఓ వితంతును వంచించి రూ.మూడు లక్షల వరకు కొల్లగొట్టిన సైబర్‌ నేరగాడిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ బి.ప్రకాష్‌ కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన రాజ్‌వన్స్‌ ఇండియన్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీ పూర్తయ్యాక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశాడు. ఆ తర్వాత మైనింగ్‌తో పాటు టీకప్‌ల తయారీ పరిశ్రమను నిర్వహించాడు.

అయితే ఈ వ్యాపారాల్లో నష్టం రావడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అమాయకులను మోసగించి డబ్బులు సంపాదించేందుకు ఓ ఆన్‌లైన్‌ డేటింగ్‌ సైట్‌లో తన వివరాలు నిక్షిప్తం చేశాడు. అయితే 2019 మార్చి నుంచి ఓ వితంతువు రాజ్‌వన్స్‌తో పరిచయం పెంచుకుంది. ఈ సమయంలో తనకు కూడా విడాకులయ్యాయని, అయితే బెంగళూరులో బాగా లాభాలు చేకూర్చే హౌస్‌ కీపింగ్‌ సంస్థను నిర్వహిస్తున్నానంటూ నమ్మించాడు. ఆ తర్వాత తన కంపెనీలో డీలర్‌షిప్, డైరెక్టర్‌షిప్‌తో పాటు మీ కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు.

ఇదంతా నిజమని నమ్మి తన వ్యాపార విస్తరణకు, వైద్యం కోసం డబ్బులు అవసరమంటూ చెప్పడంతో బాధితురాలు దఫాదఫాలుగా రూ.మూడు లక్షలు రాజ్‌వన్స్‌ పంపిన బ్యాంక్‌ ఖాతాలకు బదిలీ చేసింది. ఆ తర్వాత నుంచి అతడు స్పందించలేకపోవడంతో మోసపోయానని తెలిసి రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీ సులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక సాక్ష్యాలతో నిందితుడు రాజ్‌వన్స్‌ను బెంగళూరులో అరెస్టు చేసి అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌వారంట్‌పై నగరానికి తీసుకొచ్చి చర్లపల్లి జైలుకు తరలించారు.  
చదవండి:
ఉద్యోగం ముసుగులో వ్యభిచారం 

మరిన్ని వార్తలు