ఆశపడి.. చెప్పుకోలేక.. తట్టుకోలేక..

10 Jul, 2021 08:49 IST|Sakshi

ఈజీ మనీ పేరిట టోకరా..!

సైబర్‌ కేటుగాళ్ల ఘరానా మోసం

ఆన్‌లైన్‌లో యాప్‌లు క్రియేట్‌ చేసి.. డబ్బుల ఆశ చూపి..

ప్రజలను ఆకర్షించి పెట్టుబడులు పెట్టించుకున్న వైనం

పెట్టుబడిదారుల సంఖ్య పెరగ్గానే బిచానా ఎత్తేసి..

రూ. కోట్లు కొల్లగొట్టినట్లు అంచనా

నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో ఆలస్యంగా  వెలుగులోకి..

మోసపోయామని గుర్తించి లబోదిబోమంటున్న వందలాదిమంది బాధితులు

‘‘మా యాప్‌లో పెట్టుబడి పెడితే.. మీకు ప్రతి రోజు డబ్బులే డబ్బులు.. పెట్టిన పెట్టుబడికి రూ.లక్షలు వచ్చి మీ ఖాతాలో జమ అవుతాయి. కొద్ది రోజుల్లోనే మీరు లక్షాధికారులు కావచ్చు..’’ అంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు. తొలుత పెట్టుబడి పెట్టిన వారికి చెప్పిన విధంగానే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశారు.. వారి ద్వారా పెట్టుబడి దారుల సంఖ్య గణనీయంగా పెరగ్గానే బిచానా ఎత్తేశారు. ఇలా సైబర్‌ కేటుగాళ్లు రూ.వేలు కాదు.. రూ. లక్ష కాదు.. ఏకంగా కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఆన్‌లైన్‌ మోసగాళ్ల మాయాజాలం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నాగార్జునసాగర్‌ : సైబర్‌ కేటుగాళ్లు రూటు మార్చా రు. ఈజీ మనీ ఆశచూపి బాధితులను నిలువునా ముంచేశారు. కొంతకాలంగా కేటుగాళ్లు నాగార్జునసాగర్, నిడమనూరు, హాలియా పట్టణాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. వొరాకిల్, పూలిన్‌ తదితర యాప్‌లను క్రియేట్‌ చేశారు. ఈ యాప్‌లలో డబ్బులు పెడితే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించుకోవచ్చని ఎరవేశారు. 

రూ. 2లక్షలు పెట్టుబడి పెడితే..
ఆసక్తి ఉన్న తమ యాప్‌లలో రూ.2లక్షలు పెట్టుబడి పెడితే వారానికి రూ.13వేల చొప్పున నెలకు రూ.52వేలు వస్తాయని, ఈవిధంగా 52వారాల పాటు మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని నమ్మబలికారు. మొదట ఈ స్కీంలో చేరిన వారికి వారు చెప్పిన విధంగా రూ.6లక్షలు జమచేశారు.ఇదే తరహాలు పలు స్కీలు క్రియేట్‌ చేసి నడుపుతున్నట్లు తెలిసింది. అయితే, కేటుగాళ్లు మొదట చేరిన వారికి లక్ష్యంగా చేసుకుని ఏజెంట్లుగా నియమించుకున్నారు. ఈ స్కీంలో ఇతరులను చేర్పిస్తే మీకు కమీషన్‌ ఇస్తామని చెప్పారు. దీంతో తొలుత స్కీంలో పెట్టుబడి పెట్టి ఏజెంట్లుగా మారిన యువకులు, ఉద్యోగులు మిగతా వారిని మా ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. మీకు ఇష్టం ఉంటే మీరు కూడా చేరొచ్చని నమ్మించారు. దీంతో నాగార్జునసాగర్, నిడమనూరు, హాలియాకు చెందిన సుమారు 600మంది బాధితులు చేరినట్టు సమాచారం. 

ఏజెంట్లకు గోవాలో శిక్షణ
సుమారు ఆరు నెలలుగా సాగుతున్న మాయాజాలానికి కేటుగాళ్లు ఆయా ప్రాంతాల్లో పలువురు ఏజెంట్లను నియమించుకున్నారు. వీరందరికీ కొంతకాలం క్రితం గోవాలో శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిసింది. అత్యధిక సంఖ్యలో పెట్టుబడిదారులను చేర్పించి ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు ఇస్తామని ఆశ చూపి తమ మోసాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఐడీలో కనిపిస్తూ.. బదలాయించుకునేందుకు అవకాశం లేకుండా..
కేటుగాళ్లు స్కీంలో చేరిన పెట్టుబడిదారుడి పేరిట ఒక ఐడీ క్రియేట్‌ చేస్తారు. అందులో చెప్పినట్లు వారం, రెండు రోజుల్లో డబ్బులు(డాలర్స్‌) జమ అవుతున్నట్లు కనిపిస్తాయి. అయితే కేటుగాళ్లు ఇక్కడే ఒక తిరకాసు పెడతారు. ఆ డబ్బులను 20నుంచి నెల రోజుల తర్వాత బదలాయించుకోవచ్చని చెబుతారు. దీంతో యాప్‌లో కనిపిస్తున్న డబ్బులతో బాధితుడు సంతోషిస్తూ మరికొందరికి చూపించి ఈ స్కీంలో చేర్పించినట్లు తెలుస్తోంది. ఇలా వందల సంఖ్యలో చేరిన బాధితులకు యాప్‌లో డబ్బులు కనిపిస్తూ.. బదలాయించుకునే అవకాశం లేకుండా కేటుగాళ్లు రూ. కోట్లను దండుకున్నట్లు సమాచారం. 

చెప్పుకోలేక.. తట్టుకోలేక..
కొద్ది రోజులుగా డబ్బులు ఖాతాకు బదిలీ కాకపోవడంతో బాధితులు మోసపోయామని గుర్తించి లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి ఎవరీకి చెప్పుకోలేక.. తట్టుకోలేక.. అన్న చందంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఇందులో కొసమెరుపు ఏమిటంటే బాధితుల్లో జెన్‌కో ఉద్యోగులతో పాటు ఓ ప్రజాప్రతినిధి బంధువు కూడా రూ. లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లు తెలిసింది. కాగా, ప్రభుత్వం ఇలాంటి స్కీంలు మొదలు కాగానే వాటిని మూయించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.స్కీంలకు ఏజెంట్లుగా చేరి యువతను పక్కతోవ పట్టించిన వారిపై పోలీస్‌ శాఖ చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

అప్రమత్తంగా ఉండాలి
ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆన్‌లైన్‌ మోసగాళ్లు మల్టీపర్పస్‌ బిజినెస్‌ పేరిట మోసాలకు పాల్ప డుతున్నారు. ఏ బ్యాంకు అధికారులు కూడా మీ వ్యక్తి ఖాతాలు, ఆధార్‌ ఇతర వివరాలు అడగరు. ఈజీమనీ ఆశకు పోయి మోసపోవొద్దు. సైబర్‌ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ఆన్‌లైన్‌ మోసం విషయం తమ దృష్టికి కూడా వచ్చింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఇలాంటి మోసాలు తెలిసినా తమ దృష్టికి తీసుకురావాలి.
– రంగనాథ్, డీఐజీ, ఎస్పీ, నల్లగొండ 

మరిన్ని వార్తలు