Whatsapp Hacking: ఎన్‌ఆర్‌ఐల వాట్సాప్‌నూ వాడేసుకుంటున్నారు! 

16 May, 2021 07:00 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సైబర్‌ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. ఒక్కో తరుణంలో ఒక్కో తరహా నేరాలు చేసే ఈ క్రిమినల్స్‌ తాజాగా వాట్సాప్‌ను తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. విదేశాల్లో ఉన్న భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) ఖాతాలను హ్యాక్‌ చేస్తూ ఇక్కడ ఉన్న వారి సంబంధీకుల నుంచి డబ్బు కాజేస్తున్నారు. ఈ తరహా నేరాలకు సంబంధించి బుధ, గురువారాల్లో రెండు కేసులు నమోదైనట్లు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వెల్లడించారు. ఈ వాట్సాప్‌ హ్యాకింగ్‌ అనేది కొన్నాళ్లుగా సాగుతోంది. ఇప్పటి వరకు ఇక్కడి వారి ఫోన్లనే హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు తాజాగా పంథా మార్చారు.

అమెరికాలో ఉంటున్న ఎన్‌ఆర్‌ఐలకు చెందినవి హ్యాక్‌ చేయడం మొదలెట్టారు. సాధారణంగా ఎవరైనా ఒక స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ను వాడుతూ... మరో ఫోన్‌లోకి మారితే... ఓటీపీ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా తమ ఫోన్‌లో వాట్సాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు అందులో తాము టార్గెట్‌ చేసిన యూఎస్‌లోని ఎన్‌ఆర్‌ఐ నెంబర్లు ఎంటర్‌ చేస్తున్నారు. దీని వెరిఫికేషన్‌ కోడ్‌ అసలు యజమాని వద్దకు వెళ్తుంది. వివిధ పేర్లతో సంప్రదిస్తున్న సైబర్‌ నేరగాళ్లు ఓ లావాదేవీలో పొరపాటున మీ ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేశామని, దీంతో ఓటీపీ మీకు వచ్చిందని చెప్పి వెరిఫికేషన్‌ కోడ్‌ తీసుకుంటున్నారు.

కొన్ని సందర్భాల్లో బ్యాంకులతో పాటు ఇతర కాల్‌ సెంటర్ల పేర్లు వాడుతున్నారు. ఇలా ఓటీపీని చేజిక్కించుకుని తమ ఫోన్లలో ఎన్‌ఆర్‌ఐల నెంబర్‌తో వాట్సాప్‌ యాక్టివేట్‌ చేసుకుంటున్నారు. ఆ వెంటనే వారి వాట్సాప్‌ డీపీని కాపీ చేసి తమ దానికి పెట్టేస్తున్నారు. దీంతో పాటు సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను మార్చేస్తూ టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ పెట్టుకుంటున్నారు. దీని వల్ల అసలు వ్యక్తి ఈ విషయం గుర్తించి తన ఫోన్‌లో వాట్సాప్‌ను మరోసారి యాక్టివేట్‌ చేసుకోవాలని భావించినా... అది సాధ్యం కాదు. ఇలా అమెరికాలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ నెంబర్లు సైబర్‌ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు.

గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన శ్రీరామ్‌కు బుధవారం ఓ వాట్సాప్‌ సందేశం వచ్చింది. అమెరికాలో ఉంటున్న తన సమీప బంధువు సుజాత నెంబర్‌ నుంచి పంపినట్లు ఉంది. మెడికల్‌ ఎమర్జెన్సీ అని, డబ్బు కావాలంటూ అందులో ఉండటంతో శ్రీరామ్‌ రెండు బ్యాంకు ఖాతాల్లోకి రూ.10.98 లక్షలు బదిలీ చేశారు. కూకట్‌పల్లికి చెందిన నరేంద్రకు ఈ నెల 10న అమెరికాలో ఉంటున్న తన బాల్య స్నేహితుడు రవి శ్రీనివాస్‌ పేరుతో సందేశం వచ్చింది. ఈయన కూడా ఆ సందేశాల్లో సూచించిన బ్యాంకు ఖాతాల్లోకి రూ.10.98 లక్షలు బదిలీ చేశారు.

ఆపై ఈ బాధితులు ఇద్దరూ అమెరికాలో ఉంటున్న వారి సంప్రదించి జరిగిన మోసం తెలుసుకున్నారు. దీంతో బుధవారం శ్రీరామ్, గురువారం నరేంద్ర సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యా దు చేయడంతో కేసులు నమోదయ్యాయి. వీరు పంపిన డబ్బు ఢిల్లీ, రాజస్థాన్‌లకు చెందిన బ్యాంకు ఖాతాలకు వెళ్లినట్లు పోలీసులు తేల్చారు. ఈ ఖాతాల సారూప్యత నేపథ్యంలో ఒకే వ్యక్తి లేదా గ్యాంగ్‌ రెండు నేరాలకు పాల్పడినట్లుఅంచనా వేస్తున్నారు. 
  
ముందు ఇక్కడివే హ్యాక్‌ చేస్తారు 
ఈ సైబర్‌ నేరగాళ్లు తొలుత ఇక్కడ ఉన్న వారి వాట్సాప్‌ నెంబర్లే హ్యాక్‌ చేస్తారు. అలా వారి యాప్‌లో ఉన్న వివిధ గ్రూపుల్లోని కాంటాక్ట్స్, చాటింగ్స్‌ తదితరాలు పరిశీలిస్తారు. అందులో ఉన్న విదేశీ నెంబర్లను ఎంపిక చేసుకుని, అనువైన వాటిని హ్యాక్‌ చేసి అసలు కథ నడిపిస్తారు. ఈ తరహా నేరాలు ఇంకా జరిగే ప్రమాదం ఉంది. కేవలం సందేశాల ఆధారంగా ఆర్ధిక లావాదేవీలు చేయకూడదు. ఇలాంటి సందర్భాల్లో ఎవరికైనా డబ్బు పంపేప్పుడు వారితో ఓసారి మాట్లాడి నిర్థారించుకోవాలి.  ఆ తర్వాత కూడా డబ్బు పంపే ముందు అన్నీ సరిచూసుకోవాలి.
 – కె.బాలకృష్ణ రెడ్డి, సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ, సైబరాబాద్‌. 

చదవండి: సైకో భర్త ఘాతుకం.. ఇద్దరు భార్యలను..

మరిన్ని వార్తలు