క్రెడిట్‌ కార్డ్‌ క్లోనింగ్‌తో సైబర్‌ క్రైమ్‌! 

7 Sep, 2020 08:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లు క్రెడిట్‌ కార్డ్‌ క్లోనింగ్‌లో అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు... ఏటీఎం మెషిన్ల వద్దే అత్యాధునిక పరికరాలు బిగిస్తూ విలువైన డేటా తస్కరిస్తున్నారు... దీని ఆధారంగా బోగస్‌ కార్డులు తయారు చేసి వినియోగదారుల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు... ఈ తరహా సైబర్‌ క్రైమ్‌ మరోసారి నగరంలో వెలుగులోకి వచ్చింది. వీరి బారినపడిన ఇద్దరు బాధితులు శనివారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఖైరతాబాద్‌లోని ఏటీఎం కేంద్రంగా ఈ వ్యవహారం సాగిందని, పుప్పాలగూడలోని ఏటీఎం నుంచి నగదు డ్రా చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.  దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  

ఇది ‘మామూలు’ కాదు..
ఏటీఎమ్‌ సెంటర్‌లో డబ్బు డ్రా చేసుకోవడానికి వెళ్లే వ్యక్తి మెషిన్‌లో నిర్దేశించిన స్లాట్‌లో కార్డు పెడతారు. క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల్లోని వివరాలను తస్కరించడానికి చేతిలో ఇమిడిపోయే స్కిమ్మర్లను వినియోగిస్తారన్నది తెలిసిన విషయమే. ఇప్పుడు అవే స్కిమ్మర్లు ఫాల్స్‌ స్లాట్‌ రూపంలో ‘అందుబాటులోకి’ వచ్చాయి. వాటిని సైబర్‌ నేరగాళ్లు అసలు స్లాట్‌పై ఇలా అమరుస్తున్నారు. ఈ ఫాల్స్‌ స్లాట్స్‌లో ఉండే అత్యాధునిక పరికరాలు వినియోగదారుడు కార్డు ఇందులో నుంచి పెట్టిన వెంటనే దాని డేటాను రీడ్‌ చేస్తాయి. అంటే మన ప్రయేమం, పొరపాటు లేకుండానే రహస్య సమాచారంగా పరిగణించే డెబిట్‌/క్రెడిట్‌ కార్డు ఎలక్ట్రానిక్‌ సమాచారం ఫాల్స్‌ స్లాట్‌ రీడ్‌ చేస్తుంది. ఈ ఫాల్స్‌ స్లాట్‌ ఏటీఎం మిషన్‌ రంగు, డిజైన్‌లోనే ఉండటంతో పరిశీలించి చూస్తే తప్ప గుర్తించడం సాధ్యం కాదు.  

కెమెరాతో పిన్‌ నంబర్‌..
కేవలం కార్డుకు సంబంధించిన సమాచారం ఒక్కటే సైబర్‌ నేరగాడికి ఉపయోగపడదు. దీనిని వినియోగించాలంటే అతనికి పిన్‌ నంబర్‌ కూడా తెలియాలి. దీని కోసం దుండగుడు ఏటీఎమ్‌ మెషిన్‌ స్క్రీన్‌పై భాగంలో సీసీ కెమెరాను పోలిన చిన్న కెమెరాను ఏర్పాటు చేశాడు. ఇది వినియోగదారుడు టైప్‌ చేసే పిన్‌ నంబర్‌ను రికార్డు చేస్తుంది. సాధారణంగా ఎటీఎమ్‌ సెంటర్లలో బ్యాంకు వారు ఏర్పాటు చేసే కెమెరాలు ఇలా ఉండవు. ఎక్కువగా ఎలాంటి సెక్యూరిటీ గార్డులు లేని అన్‌మ్యాన్డ్‌ ఏటీఎం సెంటర్లనే ఈ సైబర్‌ ముష్కరులు ఎంపిక చేసుకుంటున్నారు. ఫాల్స్‌ స్లాట్, కెమెరాలకు వైఫై ఫెసిలిటీ ఉంటే... ఆ ఏటీఎమ్‌ సెంటర్‌కు సమీపంలో ఉండి ల్యాప్‌టాప్‌ ద్వారా వాటిలో రీడ్‌/రికార్డు అయిన వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తారు. ఆ పరికరాలకు వైఫై సౌకర్యం లేని పక్షంలో సైబర్‌ నేరగాడు ఎటీఎం సెంటర్‌ సమీపంలోనే కాపు కాసి ఉంటాడు. కొంత మంది కస్టమర్లు వచ్చి వెళ్లిన తరవాత అదను చూసుకుని మళ్లీ ఏటీఎం సెంటర్‌లోకి వెళ్లి ఫాల్స్‌ స్లాట్, కెమెరాలను తీసుకుని వెళ్లి కంప్యూటర్‌ సిస్టమ్‌కు అనుసంధానించడం ద్వారా వివరాలు అందులోకి పంపిస్తారు. 

రైటర్స్‌తో డూప్లికేట్స్‌ తయారీ..
ముంబై సహా అనేక మార్కెట్లతో చిప్‌తో కూడిన ఖాళీ కార్డులు బల్క్‌గా విక్రయిస్తుంటారు. ఇంటర్‌నెట్‌లోనూ ఇవి విరివిగా లభిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేసే నేరగాళ్లు కార్డ్‌ రైటర్‌ను కంప్యూటర్‌కు అనుసంధానించి, ఖాళీ కార్డులను రైటర్‌లో పెట్టి సిస్టంలో ఉన్న డేటాను దీనిలో రైట్‌ చేస్తారు. ఈ రకంగా ఇతరులకు ఎలాంటి అనుమానం రాకుండా మన కార్డును పోలిన కార్డు... మన పిన్‌ నంబర్‌ ముష్కరుల చేతికి వెళ్లిపోతాయి. సైబర్‌ నేరగాళ్లు వాటి ద్వారా మన ఖాతాలకు ఖాళీ చేసేస్తారు. ముష్కరులు ఒక్క రోజులోనే రూ.లక్షల్లో స్వాహా చేసే అవకాశం ఉంది. డబ్బు డ్రా అయిన తరవాత బాధితుడికి ఎస్సెమ్మెస్‌ అలెర్ట్‌ వచ్చినా... కాళ్లరిగేలా బ్యాంకు అధికారుల చుట్టూ తిరగడం తప్ప ఫలితం ఉండదు.  

ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఏటీఎం కేంద్రంలోకి వెళ్ళినప్పుడు కార్డు స్లాట్‌పైన ఫాల్స్‌ స్లాట్స్‌ ఏమైనా ఉన్నాయా? అనేది గమనించాలి. పరీక్షగా చూస్తే వీటిని గుర్తించడం చాలా తేలిక. మరోపక్క ఏటీఎం మెషిన్‌కు ఉండే సీసీ కెమెరా దాని లోపల ఇమిడి ఉంటుంది. ఇది కాకుండా బయట మిషన్‌కు సంబంధం లేకుండా మరోటి ఉండే అవకాశం ఉంది. వీటికి తోడు మరో కెమెరా మీ కంట పడిందంటే అనుమానించాలి. ఇటీవల కాలంలో పైన నేరగాళ్ల కెమెరా ఏర్పాటు చేసినా కస్టమర్‌ పిన్‌ ఎంటర్‌ చేస్తుంటే అది రికార్డు కాకుండా కీ ప్యాడ్‌పైన డిజైన్డ్‌ కవర్స్‌ ఏటీఎం మిషన్లుకు ఉంటున్నాయి. ఇలాంటివి లేకపోతే చేయి పైన అడ్డుపెట్టి పిన్‌ ఎంటర్‌ చేయాలి. వీలున్నంత వరకు ఇల్లు, వర్క్‌ప్లేస్‌లకు సమీపంలోని ఏదో ఒక ఏటీఎం నుంచే డబ్బు డ్రా చేయాలి. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డు ఉన్న వాటినే ఎంచుకోవాలి.  – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా