రూ.75 లక్షల లాటరీ తగిలింది.. చిన్న ప్రక్రియ అంతే! రూ.34 లక్షలు స్వాహా!

2 Nov, 2022 09:01 IST|Sakshi

గూడూరు: ‘మీకు రూ.75లక్షలు లాటరీ తగిలింది. చిన్న ప్రక్రియ పూర్తయిన వెంటనే మీ అకౌంట్‌కు డబ్బులు బదిలీ చేస్తాం...’ అంటూ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ ద్వారా నమ్మబలికి గూడూరుకు చెందిన ఓ వ్యక్తి నుంచి విడతల వారీగా రూ.34లక్షలు స్వాహా చేశాడు. పది నెలల నుంచి గుట్టుగా సాగుతున్న ఈ మోసం గురించి బాధితుడు మంగళవారం పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది.

గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఈ ఏడాది జనవరిలో అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ‘మీకు రూ.75లక్షలు లాటరీ తగిలింది. ఆ మొత్తాన్ని మీ అకౌంట్‌లో జమ చేసేందుకు కొన్ని ఫార్మాల్టీస్‌ పూర్తి చేయాల్సి ఉంది’ అని ఫోన్‌ చేసిన వ్యక్తి నమ్మబలికాడు. దీంతో అతను అడిగిన పత్రాలను బాధితుడు ఆన్‌లైన్‌లో పంపించాడు.

ఆ తర్వాత ‘మీకు మేము అందజేసే డబ్బులకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రూ.5.75లక్షలు ముందుగా కట్టాలి. అప్పుడే ఆ మొత్తాన్ని మీ అకౌంట్‌కు బదిలీ చేయగలం...’ అని చెప్పాడు. దీంతో అంత మొత్తం తన వద్ద లేదని బాధితుడు చెప్పగా, కాస్త సమయం ఇస్తున్నామని, ఎలాగైనా డబ్బులు చెల్లించి గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అజ్ఞాత వ్యక్తి నమ్మబలికాడు.

ఎట్టకేలకు బాధితుడు రూ.5.75లక్షలను అజ్ఞాత వ్యక్తి చెప్పిన బ్యాంక్‌ అకౌంట్‌లో జమ చేశాడు. మళ్లీ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ చేసి ఆదాయపన్ను చెల్లించామని, జీఎస్టీ కోసం కొంత మొత్తం పంపాలని చెప్పగా, అకౌంట్‌లో బాధితుడు డబ్బులు వేశాడు. ఇలా పలుమార్లు డబ్బులు జమ చేశాడు. చివరిగా ఇటీవల అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ చేసి ‘ఇక ప్రాసెస్‌ మొత్తం పూర్తయింది.

రూ.4.5లక్షలు చెల్లిస్తే రూ.75లక్షలు మీ అకౌంట్‌లో జమ అవుతుంది’ అని చెప్పాడు. దీంతో అంత డబ్బు తన వద్ద లేవని బాధితుడు చెప్పగా, రూ.50వేలు పంపాలని, మిగిలినవి తామే జమ చేస్తామని నమ్మబలికాడు. బాధితుడు మళ్లీ రూ.50వేలు అకౌంట్‌లో వేశాడు. ఈ విధంగా వివిధ పేర్లు చెప్పి విడతల వారీగా రూ.34లక్షలు అజ్ఞాత వ్యక్తి తన అకౌంట్లలో జమ చేయించుకున్నాడు.

అయినా బాధితుడికి లాటరీ డబ్బులు రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్‌ నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గూడూరు వన్‌టౌన్‌ ఎస్‌ఐ హజరత్‌బాబు తెలిపారు. 

గతంలోనూ మహిళకు టోకరా...
అదే విధంగా గతంలోనూ గూడూరు రూరల్‌ పరిధిలోని కంభంపాటి లక్ష్మీదేవి అనే మహిళకు లాటరీ వచ్చిందని గుర్తుతెలియని వ్యక్తులు నమ్మబలికి ఆమె నుంచి రూ.5.9లక్షలు స్వాహా చేశారు. ఈ మేరకు జనవరిలో గూడూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.    

మరిన్ని వార్తలు