లాక్‌డౌన్‌లోనూ ‘పవర్‌’ ఫుల్‌ గేమ్‌! 

25 Aug, 2020 04:08 IST|Sakshi

ఈ ఏడాది భారీగా సాగిన ‘కలర్‌ ప్రిడిక్షన్‌’ 

గత ఏడాది కంటే రెట్టింపు లావాదేవీలు 

సైబర్‌ క్రైమ్‌ కస్టడీకి ముగ్గురు నిందితులు 

సాక్షి, హైదరాబాద్‌: ‘కలర్‌ ప్రిడిక్షన్‌’ పేరుతో భారీ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు పాల్పడిన బీజింగ్‌ టీ పవర్‌ సంస్థ లాక్‌డౌన్‌ సమయంలోనూ కాసులవేటను సక్సెస్‌ ఫుల్‌గా కొనసాగించింది. గత ఏడాది జరిగిన లావాదేవీల కంటే ఈ ఏడాది తొలి ఏడున్నర నెలల్లో జరిగినవే అత్యధికమని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న చైనా జాతీయుడు యాన్‌ హూతోపాటు ఢిల్లీకి చెందిన అంకిత్, ధీరజ్‌లను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సోమవారం కస్టడీలోకి తీసుకున్నారు. బీజింగ్‌ టీ పవర్‌ సంస్థ గుర్గావ్‌ కేంద్రంగా 2019–20ల్లో దాదాపు 40 డమ్మీ కంపెనీలను రిజిస్టర్‌ చేయించింది. వీటిలో 90 శాతం భారతీయ డైరెక్టర్లు ఉండగా.. 10 శాతం చైనావాళ్ళు ఉన్నారు. ఈ 40 కంపెనీల్లోనూ కామన్‌గా ఉన్న డైరెక్టర్ల సంఖ్యే ఎక్కువ. ఈ సంస్థలు గత ఏడాది రూ.500 కోట్ల మేర దందా చేయగా ఈ ఏడాది ఆగస్టు మొదటి వారానికే రూ.1100 కోట్లకు చేరింది. ఈ కంపెనీలు దళారుల సహకారంతో, వాట్సాప్, టెలిగ్రామ్‌ గ్రూపుల ద్వారా అత్యధికంగా యువకులు, గృహిణుల్ని ఆకర్షించి ఉంటారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ సొమ్ము బీజింగ్‌ టీ పవర్‌ సంస్థతోపాటు బీజింగ్‌ టుమారో సంస్థకూ వెళ్ళినట్లు గుర్తించారు. దీంతో ఆ సంస్థ డైరెక్టర్లు ఎవరు? అనే అంశాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. యాన్‌ హూ అరెస్టు విషయం తెలిసిన వెంటనే చైనాకు చెందిన డైరెక్టర్లు దేశం విడిచి పారిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు చైనా కంపెనీలకు పేమెంట్‌ గేట్‌ వేలుగా వ్యవహరించిన పేటీఎం, క్యాష్‌ ఫ్రీ సంస్థల ప్రతినిధులు సోమవారం దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారు. ఆయా సంస్థలు చట్టబద్ధంగా ఈ–కామర్స్‌ వ్యాపారం అని చెప్పడంతోనే తాము సేవలు అందించామంటూ వీరు సమాధానం ఇచ్చారు. తమ పేమెంట్‌ గేట్‌ వేస్‌ను ఆ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నట్లు సమాచారం లేదని వివరించారు. మరోపక్క చంచల్‌గూడ జైల్లో ఉన్న యాన్‌ హూ, అంకిత్, ధీరజ్‌లను నాలుగు రోజుల విచారణ నిమిత్తం సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సోమవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సంస్థలకు సంబంధించి 30 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.50 కోట్లను ఫ్రీజ్‌ చేశారు.  
 

మరిన్ని వార్తలు