రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు..

26 Dec, 2020 10:36 IST|Sakshi

ఏటికేడాదీ పెరిగిపోతున్న సైబర్‌ నేరాలు

పోలీస్‌స్టేషన్‌ స్థాయిలో బృందాలు అవసరం..  

ఠాణాలో సిబ్బంది సంఖ్య మాత్రం అంతంతే..

2021లో ఆ దిశగా అడుగులు పడతాయనే ఆశ 

సాక్షి, సిటీబ్యూరో: 2017లో 325.. 2018లో 428.. 2019లో 1393.. ఈ ఏడాది డిసెంబర్‌ 20 నాటికే 2456.. ఓ పక్క సైబర్‌ నేరాలు ఈ స్థాయిలో పెరిగిపోతున్నాయి. మరోపక్క సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్లలో సిబ్బంది మాత్రం అరకొరగా 58 మందే ఉన్నారు. పదేళ్ల క్రితం నాటి కేటాయింపులతోనే నెట్టుకు వస్తుండటంతో పనిభారం పెరిగిపోతోంది. ఓ పక్క ఈ ఠాణాలో నానాటికీ పెరుగుతున్న ఫిర్యాదులు, కేసుల్ని సమర్థంగా విచారించడం/దర్యాప్తు చేయడం కోసం అదనపు సిబ్బందిని కేటాయిస్తూనే.. పోలీసుస్టేషన్ల స్థాయిలోనూ సైబర్‌ క్రైమ్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కనీసం 2021లో అయినా ఈ దిశగా అడుగులు పడాలని నగరవాసులు కోరుతున్నారు.  

పదేళ్ల క్రితం నాటి కేటాయింపులే..
నగరంలో నమోదవుతున్న సైబర్‌ నేరాల దర్యాప్తు చేయడం కోసం తొలినాళ్లలో సీసీఎస్‌ ఆ«దీనంలో సైబర్‌ సెల్‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం 2010లో సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌ కేటాయించింది. ప్రాథమికంగా 40 మంది సిబ్బందిని కేటాయించారు. వీరితోనే రెండు సైబర్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్స్‌ ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్‌కు ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వం వహించేలా.. సహకరించడానికి ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు హెడ్‌–కానిస్టేబుళ్లు, పది మంది కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు ఉంటారు. గడిచిన పదేళ్లలో పెరిగిన సిబ్బంది సంఖ్య కేవలం 8 మాత్రమే. సైబర్‌ నేరాలు నానాటికీ కొత్తపుంతలు తొక్కుతూ ప్రజలనే కాదు దర్యాప్తు చేస్తున్న పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఓ పక్క క్రెడిట్‌/డెబిట్‌ కార్డ్‌ ఫ్రాడ్స్‌తో పాటు నైజీరియన్‌ ఫ్రాడ్స్, డేటా థెఫ్ట్‌ తదితరాలు పెరుగుతూ పోతున్నాయి. వీటికి తోడు హ్యాకింగ్‌తో పాటు ఎస్‌ఎమ్మెస్, ఈ–మెయిల్‌ ఫ్రాడ్స్‌ సంఖ్య పెరిగింది. ఆ సంఖ్యలో సిబ్బంది పెరగకపోవడంతో కేసుల దర్యాప్తులో అనేక ఇబ్బందులు వస్తున్నాయి.
 

నిత్యం వేల సంఖ్యలో ఫిర్యాదులు.. 
సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో నమోదవుతున్న కేసుల్లో నైజీరియన్‌ ఫ్రాడ్స్‌తో పాటు ఆర్థిక సంబంధ నేరాలే ఎక్కువగా ఉంటున్నాయి. నమోదయ్యే కేసులకు దాదాపు పది రెట్లు పిటిషన్లు వస్తున్నాయి. గతేడాది 325 కేసులు నమోదు కాగా.. ఆరు వేల పిటిషన్లు వచ్చాయి. ఈ ఏడాది డిసెంబర్‌ 20 వరకు 2,456 కేసులు నమోదు కాగా.. ఏడు వేల పిటిషన్లు వచ్చాయి. ఒక్కో పిటిషన్‌ను విచారించిన తర్వాత మాత్రమే కేసుగా నమోదు చేసేలా నిబంధన ఏర్పాటు చేసుకున్నారు. ఇలా వేల సంఖ్యలో వస్తున్న ఫిర్యాదుల్ని విచారించడం సైతం ఉన్న సిబ్బందికి తలకు మించిన భారంగా మారిపోయింది. నగరంలో నమోదవుతున్న సైబర్‌ నేరాల్లో మూడు రకాలైనవే ఎక్కువగా ఉంటున్నాయి. ఆర్మీ ఉద్యోగులుగా పేర్కొంటూ తక్కువ ధరకు వాహనాలు, వస్తువుల పేరుతో యాడ్స్‌ యాప్‌ల్లో, ఫేస్‌బుక్‌లోని మార్కెట్‌ ప్లేస్‌లో పోస్టులు పెట్టి మోసం చేసే ఓఎల్‌ఎక్స్‌ ఫ్రాడ్స్, బ్యాంకు అధికారుల మాదిరిగా ఫోన్లు చేసిన వ్యక్తిగత సమాచారంతో పాటు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్స్‌(ఓటీపీ) కూడా తీసుకోవడం లేదంటే టీమ్‌ వ్యూవర్‌ సహా వివిధ రకాలైన యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేయించి ఖాతాలు ఖాళీ చేసే ఓటీపీ మోసాలు మొదటి రెండు స్థానాల్లో ఉంటున్నాయి. ఉద్యోగాలు, విదేశీ వీసా, ఇన్సూరెన్స్‌ పాలసీలపై బోనస్, గిఫ్టులు, లాటరీల పేరుతో చేసే కాల్‌ సెంటర్‌ ఫ్రాడ్స్‌ కేసులది మూడో స్థానం.  

పోలీసుస్టేషన్లలో టీమ్స్‌ అవశ్యం..
ఈ పరిస్థితుల్ని చక్కదిద్దడానికి జోనల్‌ స్థాయిలో బృందాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అయితే పోలీసుస్టేషన్లలోనే టీమ్స్‌ ఉండాలని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణా పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాటు. ఈ ఏడాది బంజారాహిల్స్‌ ప్రాంతంలో ఓ కంపెనీ అకౌంట్‌ టేకోవర్‌ స్కామ్‌లో రూ.2.09 కోట్లు పోగొట్టుంది. అలాగే  అంబర్‌పేట్‌కు చెందిన ఓ యువకుడు ఓఎల్‌ఎక్స్‌ ఫ్రాడ్‌లో రూ.6 వేలు కోల్పోయాడు. ఈ రెండు కేసులూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులే దర్యాప్తు చేయాల్సి వస్తోంది. అలా కాకుండా పోలీసుస్టేషన్లలో ఉండే యూనిట్స్‌ చిన్నచిన్న కేసుల్ని పర్యవేక్షించేలా రూపొందించాలి. భారీ మొత్తాలు, సంచలనాత్మక కేసుల్ని మాత్రమే ఈ సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు బదిలీ చేయాలి. అన్ని పోలీసుస్టేషన్లలోనూ యూనిట్లనూ సీసీఎస్‌ ఆధీనంలో ఉంచి, తరచూ శిక్షణ ఇస్తుండాలి. సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు అత్యవసరంగా 19 మందిని కేటాయించాల్సిందిగా కోరుతూ అధికారులు దాదాపు రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపారు. ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఆరుగురు ఎస్సైలతో పాటు 10 మంది కానిస్టేబుళ్లను కోరారు. ఇప్పటి వరకు వీటికి మోక్షం లభించలేదు. పోలీసుస్టేషన్లలో యూనిట్ల ఏర్పాటు అంశమూ ఇలా కాకుండా 2021లో అమలులోకి రావాల్సిన అవసరం ఉంది.  

ఆ ప్రాంతాలకు చెందిన వారే నిందితులుగా.. 
నగరంలో నమోదవుతున్న సైబర్‌ నేరాల్లో బయటి రాష్ట్రాలకు చెందిన వారే 95 శాతం వరకు నిందితులుగా ఉంటున్నారు. వ్యక్తిగత దూషణలు, అసభ్య, అశ్లీల సందేశాలు, ఫొటోలు పంపడం, కంపెనీల డేటా దురి్వనియోగం వంటి వాటిలో మాత్రమే స్థానికులు నిందితులుగా ఉంటున్నారు. మార్కెట్‌ ప్లేస్, ఓఎల్‌ఎక్స్‌ నేరగాళ్లకు రాజస్థాన్‌లోని మేవాట్‌ రీజియన్‌లో ఉన్న ఆల్వార్, భరత్‌పూర్‌.. ఓటీపీ ఫ్రాడ్‌స్టర్స్‌కు జార్ఖండ్‌లోని జామ్‌తార, దేవ్‌ఘర్, గిరిధ్‌.. కాల్‌ సెంటర్ల కేంద్రంగా నడిచే ఇతర నేరాలు చేసే వారికి ఢిల్లీ, కోల్‌కతా అడ్డాలుగా మారాయని ఇప్పటికే గుర్తించారు. ఈ సైబర్‌ నేరాల్లో నిందితులు బాధితులకు కనిపించరు. కేవలం ఫోన్‌కాల్స్‌ ఆధారంగానే వీళ్లు తమ పని పూర్తి చేసుకుంటారు. ఒక్కోసారి ‘వినిపించకుండా’నూ అందినకాడికి దండుకుంటారు. ఈ తరహా సైబర్‌ నేరాలు చేసే వాళ్లు పశి్చమ బెంగాల్‌లో ఉన్న చిత్తరంజన్, అసన్‌సోల్‌లకు చెందిన వారి బ్యాంకు ఖాతాలు వాడుకుంటున్నారు. ఈ కారణంగానే అనునిత్యం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు చెందిన ఓ టీమ్‌ ఉత్తరాదిలోనే ఉండిపోవాల్సి వస్తోంది. 

నేరుగా మూసేయడమూ సాధ్యం కాదు..
ఈ సైబర్‌ నేరగాళ్లు నూటికి నూరు శాతం నకిలీ ‘ఆధారాలతోనే’ నేరాలు చేస్తుంటారు. బాధితుల్ని సంప్రదించడానికి వినియోగించే ఫోన్‌ నంబర్లు, వీరి నుంచి డబ్బు కాజేయడానికి వాడే బ్యాంకు ఖాతాలు, వాలెట్స్‌ సహా ఏ ఒక్కటీ వీరి పేరుతో ఉండదు. నకిలీ వివరాలతో లేదా కమీషన్లకు ఆశపడి తమకు సహకరించే మనీమ్యూల్స్‌గా పిలిచే మధ్యవర్తుల సాయంతో తమ ‘పని’ పూర్తి చేసుకుంటారు. ఈ కారణంగానే ఏటా నమోదవుతున్న కేసుల్లో అనేకం ఎలాంటి ఆధారాలు దొరక్క క్లోజ్‌ అవుతూ ఉంటాయి. ఫిర్యాదులోని అంశాలు, కేసు తీరుతెన్నుల ఆధారంగా ఇలా క్లోజ్‌ అయ్యే వాటిని సైబర్‌ క్రైమ్‌ అధికారులు తేలిగ్గానే గుర్తిస్తారు. అలాగని పెండెన్సీ తగ్గించుకోవడానికి ఇలాంటి కేసుల్ని తక్షణం క్లోజ్‌ చేయడానికీ ఆస్కారం లేదు. దర్యాప్తు నిమిత్తం ఒకటి రెండుసార్లు ఆయా రాష్ట్రాలకు వెళ్లి వచ్చి, పక్కాగా ఆధారాలు దొరలేదని నిరూపించిన తర్వాతే ఈ క్లోజర్‌కు ఆస్కారం ఉంటుంది. ఓ పక్క సిబ్బంది కొరత.. మరోపక్క పెరుగుతున్న నేరాలతో ప్రస్తుతం సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసుల పెండెన్సీ ఎక్కువవుతోంది.

ఇవీ సిటీ సైబర్‌ ఠాణా సిబ్బంది వివరాలు
ఏసీపీ: 1, ఇన్‌స్పెక్టర్లు: 7, ఎస్సైలు: 13 
కానిస్టేబుళ్లు, హెడ్‌–కానిస్టేబుళ్లు: 33 
హోంగార్డులు: 4, మొత్తం: 58   

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు