‘ఢిల్లీ కస్టమ్స్‌ వాళ్లు నన్ను రానివ్వట్లేదు’

9 Sep, 2021 10:48 IST|Sakshi

సాక్షి, హిమాయత్‌నగర్‌(హైదరాబాద్‌): కాంచన్‌బాగ్‌కు చెందిన యువకుడికి కొద్ది నెలల క్రితం ఫేస్‌బుక్‌లో ఓ యువతి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టింది. కొద్దిరోజులకు మెసేంజర్‌ చాటింగ్‌ అనంతరం వాట్సాప్‌ నంబర్స్‌ను ఇచ్చిపుచ్చుకున్నారు. నిన్ను చూడటానికి యూఎస్‌ నుంచి కెనడా మీదుగా ఇండియా వస్తున్నా అని చెప్పింది. కట్‌ చేస్తే.. రెండు రోజుల తర్వాత నీకోసం తెస్తున్న గిఫ్టులను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ వాళ్లు పట్టుకున్నారని, నా వద్ద ఉన్న కరెన్సీ మార్చుకునే సమయం కూడా లేదని చెప్పింది. మాటలు విన్న యువకుడు రూ.6.20 లక్షలను అకౌంట్స్‌కు పంపాడు. ఆ తర్వాత నుంచి ఫోన్‌ స్విచ్చాఫ్‌ రావడంతో బుధవారం సిటీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

మరో ఘటనలో..

నమ్మించి.. బంగారు గొలుసు లాక్కెల్లారు 
సాక్షి,కాచిగూడ(హైదరాబాద్‌): మహిళ మెడలోంచి బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌  వివరాల ప్రకారం.. పటేల్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఇంద్రజ (25) భర్త బాలసుమన్‌ ఇద్దరు మూగవాళ్లు. బుధవారం విద్యానగర్‌లోని మానసిక వికలాంగుల కేంద్రానికి భార్యాభర్తలు కలిసి వచ్చారు. తిరుగు ప్రయాణంలో విద్యానగర్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. అక్కడ ఉన్న ముగ్గురు గుర్తు తెలియని దొంగలు వీరిద్దరికి రైలు టికెట్లను ఇప్పిస్తామని నమ్మించారు.  భార్యాభర్తలు రైలు ఎక్కుతుండగా ఇంద్రజ మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసును టికెట్‌ను ఇప్పించిన వారే లాక్కొని పారిపోయారు. ఈ సంఘటనపై ఇంద్రజ కాచిగూడ రైల్వే పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

చదవండిమా పిన్ని ఓ లేడీ టైగర్‌.. రక్షించండి సార్‌

మరిన్ని వార్తలు