Cyber crime: తోడు కావాలని కాల్‌ చేస్తే.. పని పూర్తి చేసి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌

21 Jul, 2021 09:04 IST|Sakshi

సాక్షి,హిమాయత్‌నగర్‌(హైదరాబాద్‌): ‘మీరు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా? మీకు తోడు కావాలా? ఇదిగో ఈ మెసేజ్‌లో ఉన్న నంబర్‌కు ఫోన్‌ చేయండి స్నేహితులతో గంటల తరబడి మాట్లాడుకోండి’ అంటూ సికింద్రాబాద్‌కు చెందిన 72 ఏళ్ల వృద్ధుడికి ఓ మెసేజ్‌ వచ్చింది. కుమారులు, కుమార్తెలు అంతా దుబాయిలో ఉంటున్నారు. ఆయనను పలకరించే వారెవరూ లేకపోవడంతో తోడు కోసం ఆశపడి సైబర్‌ నేరగాడు చెప్పినట్లు చేశాడు. అంతే.. పలు దఫాలుగా రూ.7.8 లక్షలు లూటీ అయ్యాయి. తన డబ్బులు తిరిగి రావాలంటే మరో రూ.3 లక్షలు ఇస్తేనే రూ.7.8 లక్షలు ఇస్తామన్నారు. దీంతో ఆయన మరో రూ.3 లక్షలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. తను మోసపోయానని గ్రహించిన బాధితుడు మంగళవారం సిటీ సైబర్‌ క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు.  

ప్రాఫిట్‌ వస్తుందని నమ్మించి..  
మొగల్‌పురాకు చెందిన సయ్యద్‌ సోహేల్‌ మొయినుద్దీన్‌కు కొద్దిరోజుల క్రితం ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యా డు. తాను ‘డబ్ల్యూపీఇన్‌వెస్‌ 66.కామ్‌’లో ఇన్వెస్ట్‌ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాన్నాడు. దీంతో మొయినుద్దీన్‌ కూడా ఆ యాప్‌లో తొలుత రూ.10 వేలతో రిజిస్టర్‌ అయ్యా డు. లాభం రూ.10వేలు కనిపించింది. దీంతో ఆ డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తే రావట్లేదు. నా డబ్బులు నాకు కావాలని తన స్నేహితుడికి చెప్పడంతో అవి రావాలంటే ఇంకా వ్యాపారం చేస్తున్నట్లుగా ఆ యాప్‌లో చూపించుకోవాలన్నాడు. ఇలా పలు దఫాలుగా రూ.2.40 లక్షలను కాజేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

క్రెడిట్‌ కార్డు గిఫ్ట్‌ పేరుతో..   
కాచిగూడకు చెందిన దేవకీనందన్‌కు క్రెడిట్‌ కార్డు నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. మీ కార్డుపై మీకు రూ.5వేల బహుమతి వచ్చింది. మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ చెప్పమన్నారు. ఆమె ఓటీపీ నంబర్‌ చెప్పడంతో ఆ కార్డులో ఉన్న రూ.లక్ష లిమిట్‌ను క్షణాల్లో స్వైప్‌ చేశాడు. దీంతో బాధితుడు మంగళవారం సిటీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వార్తలు