ఇన్‌స్టాగ్రామ్‌తో ఏడిపించాడు

29 Jul, 2020 07:12 IST|Sakshi

చదివింది ఏడు...చేసేది కూలీపని 

సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిల ఫొటోలు, వీడియోల సేకరణ 

నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలతో వేధింపులు నిందితుడు సాయికుమార్‌ అరెస్టు  

సాక్షి, సిటీబ్యూరో: ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అమ్మాయిలను వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే...మూసాపేటకు చెందిన వొరిసా సాయికుమార్‌ ఏడో తరగతితో చదువుకు స్వస్థి చెప్పి కూలీగా పని చేస్తున్నాడు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే అతను ఇన్‌స్ట్రాగామ్‌లో పలువురు అమ్మాయిల ఫొటోలు, వీడియోలు సేకరించాడు. అదే తరహాలో ఓ బాలిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు అప్‌లోడ్‌ చేసి ఉన్న ప్రొఫైల్‌ పిక్చర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న అతను ఆమె పేరును సరిపోలేలా నకిలీ ఖాతా క్రియేట్‌ చేసి ఆమె ప్రొఫైల్‌ పిక్చర్‌ను అప్‌లోడ్‌ చేశాడు.

అనంతరం బాధితురాలి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా నగ్న వీడియోలు పోస్టు చేశాడు. ఆ తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్నేహితుల ద్వారా ఆమె సెల్‌ఫోన్‌ నంబర్‌ను సేకరించి వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు పంపాలంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు.  ఆతర్వాత బాధితురాలి తల్లి ఫొటోను ప్రొఫైల్‌ పిక్చర్‌గా పెట్టుకొని మరో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా సృష్టించి ఫొటోలు, వీడియోలు పంపాలని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నిందితుడు సాయికుమార్‌ను అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు