కోవిడ్‌ దెబ్బకు క్రిమినల్‌ అవతారం

10 Nov, 2020 08:44 IST|Sakshi

లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన ఎథికల్‌ హ్యాకర్‌ 

రుణాల చెల్లింపు కోసం మాట్రిమోనియల్‌ ఫ్రాడ్స్‌ 

సిటీతో పాటు బెంగళూరు, హుబ్లీల్లోనూ కేసులు 

అరెస్ట్‌ చేసిన  హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ కాప్స్‌ 

సాక్షి, సిటీబ్యూరో: సాఫ్ట్‌వేర్‌ రంగంలో పని చేసే వారి జీవితాల్లో మరో దయనీయ కోణమూ ఉంది. తమ జీతంపై ఆశతో అనేక మంది అప్పులు చేస్తున్నారు. కోవిడ్‌ వంటి వాటితో పరిస్థితులు తల్లకిందులైతే దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. అలాంటి వారిలో కొందరు ఆత్మహత్యలు చేసుకోవడం, నేరగాళ్లుగా మారడం జరుగుతోంది. దీనికి తాజా ఉదాహరణే హేమంత్‌కుమార్‌ వ్యవహారం. మాట్రిమోనియల్‌ ఫ్రాడ్స్‌కు పాల్పడుతున్న ఇతగాడిని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.  బెంగళూరుకు చెందిన హేమంత్‌కుమార్‌ ఉన్నత విద్యనే అభ్యసించాడు. చాన్నాళ్లు అక్కడి ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఎథికల్‌ హ్యాకర్‌గా పని చేశాడు. ఆ సమయంలో ప్రతి నెలా ‘ఐదంకెల’ జీతం అందుకున్న హేమంత్‌కుమార్‌ దానికి తగ్గట్లే తన లైఫ్‌ను ప్లాన్‌ చేసుకున్నాడు.  ప్రతి నెలా వచ్చే జీతంలో తన ఖర్చులు పోగా.. ఎక్కువ మొత్తమే మిగిలేది. దీంతో దాదాపు ఐదేళ్లు కష్టపడి పొదుపు చేసుకున్న డబ్బుతో పాటు మరికొంత మొత్తం రుణం తీసుకుని బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీలో ఓ ఫ్లాట్‌ కొన్నాడు. కొన్నాళ్ల పాటు ఈఎంఐల చెల్లింపు సజావుగానే సాగింది.  కోవిడ్‌ ప్రభావంతో లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో అనేక మంది సాఫ్ట్‌వేర్‌ రంగానికి చెందిన వారి మాదిరిగానే అతడు సైతం ఇబ్బంది పడ్డాడు.

హఠాత్తుగా ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడ్డాడు. కొత్తగా ఖరీదు చేసిన ఫ్లాట్‌కు సంబంధించిన ఈఎంఐలు చెల్లించలేని స్థితికి చేరాడు.  తన కష్టార్జితంతో పాటు రుణం తీసుకుని ఖరీదు చేసిన ఆ ఫ్లాట్‌ బ్యాంకు వారి పరం అవుతుందని భయపడ్డాడు. దానికి సంబంధించిన ఈఎంఐలు చెల్లించడంతో పాటు పనిలో పనిగా తన ఖర్చుల కోసమూ మాట్రిమోనియల్‌ ఫ్రాడ్స్‌ మొదలెట్టాడు.  పలు మాట్రిమోనియల్‌ సైట్స్‌లో తన పేరు, వివరాలను రిజిస్టర్‌ చేసుకున్నాడు. అందులో ఉన్న యువతుల ప్రొఫైల్స్‌లో కొన్నింటిని ఎంపిక చేసుకునే వాడు. వారికి సందేశాలు పంపుతూ వివాహం చేసుకోవడానికి సమ్మతమని చెప్పేవాడు.  తాను బెంగళూరులో పని చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పరిచయం చేసుకునే వాడు. తన వల్లోపడిన వారితో కొన్నాళ్లు చాటింగ్, ఫోన్‌ కాల్స్‌ కొనసాగించేవాడు. ఆపై అసలు కథ మొదలెట్టే హేమంత్‌కుమార్‌ తనకు అత్యవసరమనో, తల్లిదండ్రులకు ఆనారోగ్యమనో ఆ యువతితో చెప్పేవాడు.  ఆ కారణంతో ఆమె నుంచి అందినకాడికి తీసుకుని దండుకుని ఆపై మోసం చేసేవాడు.

కొన్నిసార్లు తన ఫోన్‌ నెంబర్‌ మార్చేయగా.. మరి కొన్నిసార్లు ఎదుటి వారివి బ్లాక్‌ చేస్తున్నాడు. ఇతడి చేతిలో మోసపోయిన అనేక మంది యువతులు మిన్నకుండిపోయాడు.  బెంగళూరుకు చెందిన ఓ యువతి ఫిర్యాదుతో అక్కడి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌పై వచ్చిన ఇతగాడు నెల కూడా సక్రమంగా ఉండలేదు. మరో పేరులో మరో మాట్రిమోనియల్‌ సైట్‌లో రిజిస్టర్‌ చేసుకున్నాడు. హుబ్లీ చెందిన యువతిని మోసం చేయడంతో ఆమె అక్కడ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన మరో యువతి నుంచి కూడా హేమంత్‌కుమార్‌  రూ.2.1 లక్షలు తీసుకుని మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో హేమంత్‌కుమార్‌పై నగరంలో  కేసు నమోదైంది.  దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డి నిందితుడు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేశారు. సోమవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు