‘ఎల్‌ఐసీ’ పేరుతో నయాదందా 

3 Mar, 2021 08:04 IST|Sakshi

మిర్యాలగూడ : అమాయకులను ఆసరాగా చేసుకొని సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బీమా ప్రీమియంల పేరుతో మిర్యాలగూడలో కొంతమంది ఏజెంట్లు నయాదందా కొనసాగిస్తున్నారు. ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాలతో పాటు వివరాలను చోరీ చేసి ఎల్‌ఐసీ పాలసీలను సృష్టించారు. తన బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము ఖాళీ అయిన తర్వాత బాధితుడు ఆరా తీస్తే అసలు నిజాలు వెలుగు చూశాయి. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్‌పేటకు చెందిన కందుకూరి భాస్కర్‌కు స్థానిక ఎస్‌బీఐ బ్రాంచిలో ఖాతా ఉంది. కాగా తన ఖాతాలో నుంచి 2020 నవంబర్‌ 30న రూ.2,692, డిసెంబర్‌ 28న రూ.2,692 చొప్పున రూ.5,384 కట్‌ అయ్యాయి. కాగా తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్‌ అయినట్లు తెలుసుకుని ఏటీఎం ద్వారా మినీ స్టేట్‌మెంట్‌ తీసుకుని బ్యాంకుకు వెళ్లాడు. ఎల్‌ఐసీ ప్రీమియంకు ఖాతా నుంచి డబ్బు చెల్లించినట్లు బ్యాంకు అధికారులు అతడికి తెలియజేశారు. 

ఎల్‌ఐసీ ప్రీమియంలు సృష్టించిన ఏజెంట్లు..
బాధితుడికి ఎల్‌ఐసీ బీమా లేదు. కానీ తన బ్యాంకు ఖాతా నుంచి ఎల్‌ఐసీ పాలసీలకు ఎలా చెల్లింపులయ్యాయనే విషయాన్ని తెలుసుకునేందుకు స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లాడు. ఆయనకు అక్కడ విస్తుపోయే నిజాలు తెలిశాయి. తన పేరున పది పాలసీలు ఉన్నాయని అక్కడి అధికారులు పాలసీ నంబర్లు 649641055 నుంచి 649641064 వరకు వరుసగా ఇచ్చారు. ఎనిమిది పాలసీలకు నెలకు రూ.274, రెండు పాలసీలకు రూ.250 చొప్పున రెండు నెలల పాటు చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని చిలుకలూరిపేటకు చెందిన ఎల్‌ఐసీ ఏజెంట్, స్థానిక డీఓ ద్వారా పాలసీ ప్రీమియంలు తీసుకున్నట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. 

పోలీసులకు ఫిర్యాదు..
తన బ్యాంకు ఖాతాలోని సొమ్ము కాజేసి ఫోర్జరీ సంతకాలతో ఎల్‌ఐసీ ప్రీమియంలు చెల్లించారని బాధితుడు భాస్కర్‌ 2021 జనవరి 5న వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు అతడికి రశీదు కూడా ఇచ్చారు. తర్వాత ఈ నెల 1వ తేదీన బాధితుడి నుంచి మరోసారి ఫిర్యాదు తీసుకుని శ్రీనివాస్, సైదయ్యపై మంగళవారం నాలుగు సెక్షన్లు 420, 423, 468, 471 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు