ఇన్‌స్టాలో పరిచయం, ఆపై స్నేహం.. చివరికి యువతిని నమ్మించి..

10 Jul, 2022 11:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బనశంకరి(బెంగళూరు): ఇన్‌స్టా గ్రామ్‌లో గుర్తుతెలియని వ్యక్తి ఒక అమ్మాయికి మాయమాటలు చెప్పి లక్షలాది రూపాయలను కొట్టేశాడు. బెంగళూరు నగరంలో ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థినికి ఇటీవల ఇన్‌ స్టాగ్రామ్‌లో ఫ్రాంక్లిన్‌ జాక్సన్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొద్దిరోజుల పాటు ఇద్దరూ చాటింగ్‌ చేసుకోవడంతో స్నేహం పెరిగింది. జాన్సన్‌ లండన్‌లో ఉంటున్నానని చెప్పాడు. నీ పుట్టినరోజుకు 15 వేల పౌండ్లతో పాటు విలువైన కానుకలను పంపిస్తానని యువతిని నమ్మించాడు.

రెండురోజుల తరువాత స్టివ్‌ లావ్సన్‌ అనే వ్యక్తి నుంచి అమ్మాయికి వాట్సాప్‌లో మెసేజ్‌ వచ్చింది. నేను కస్టమ్స్‌ అధికారినని, మీకు లండన్‌ నుంచి నగదు, కానుకలతో కూడిన కొరియర్‌ వచ్చిందని, వీటిని మీకు పంపించాలంటే ఎయిర్‌పోర్టులో  కస్టమ్స్‌ ట్యాక్స్‌ చెల్లించాలని మెసేజ్‌లో తెలిపాడు.  నిజమేననుకున్న అమాయకురాలు తన బ్యాంకు అకౌంటులో ఉన్న రూ.31 వేలు నగదును అతను చెప్పిన బ్యాంక్‌ అకౌంట్‌కు జమచేసింది. విద్యార్థిని తన తల్లి అకౌంట్‌లో ఉన్న నగదును కూడా అతడి ఖాతాల్లోకి జమచేసింది. మొత్తం రూ.3.26 లక్షలు నగదు పంపినప్పటికీ ఎలాంటి కొరియర్‌ చేరలేదు. మరోపక్క తన ఖాతాలోని నగదు ఏమైందని అమ్మాయిని ఆమె తల్లి ప్రశ్నించింది. చివరకు ఆన్‌లైన్‌ వంచకుల వల్ల మోసపోయినట్లు గుర్తించి దక్షిణ విభాగ సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంచకుల కోసం గాలిస్తున్నారు.  

బిట్‌కాయిన్‌ అని రూ.60 వేలు వంచన 
ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయమైన శ్రేయా బన్సాల్‌ అనే యువతి మాటలు నమ్మిన విద్యార్థి ఒకరు రూ.60 వేలు పోగొట్టుకున్నాడు. బిట్‌కాయిన్‌ లావాదేవీల్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు లభిస్తాయని  తెలిపింది. ఆమె మాటలు నమ్మిన విద్యార్థి రూ.60 వేలు నగదును ఆమె అకౌంట్‌ కు జమచేశాడు. ఇంకా డబ్బు పంపాలని వంచకురాలు ఒత్తిడి చేసింది. అంతా మోసమని తెలుసుకుని బాధితుడు ఈశాన్యవిభాగ సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

సంపన్న వరుని కోసం రూ.36 లక్షలు 
బనశంకరి: పెళ్లి సంబంధాల వెబ్‌సైట్‌లో శ్రీమంతుడైన వరుని కోసం గాలించిన మహిళ రూ.36 లక్షలు పోగొట్టుకుని న్యాయంకోసం పోలీసులను ఆశ్రయించింది. బెంగళూరు టీసీ పాళ్య నివాసి యామిని అరణి బాధితురాలు. ఆమె ఒక మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లో సంపన్నుడైన పురుషుని కోసం అన్వేషించింది. ఫిబ్రవరి 27 తేదీన గుర్తుతెలియని వ్యక్తి యామినికి ఫోన్‌ చేసి పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. ఓ పని మీద కాలిఫోర్నియాకు వెళ్తున్నట్లు, అందుకు డబ్బు కావాలని, అక్కడికి వెళ్లగానే డబ్బు వాపస్‌ ఇస్తానని నమ్మించి తన బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను పంపించాడు. అతని మాటలు నమ్మిన మహిళ విడతల వారీగా రూ.36 లక్షల 88 వేలను జమచేసింది. తరువాత అతడు డబ్బు వెనక్కి ఇవ్వకపోగా, పెళ్లి చేసుకోకుండా మోసగించాడని బాధితురాలు తెలిపింది. 

చదవండి: వివాహమైనా ప్రియుడితో సన్నిహితంగా.. ఆహారంలో విషంపెట్టి..

మరిన్ని వార్తలు