సైబర్‌ వలలో మహిళలు! 

27 Apr, 2023 03:25 IST|Sakshi

గృహిణులే లక్ష్యంగా మోసాలు 

ఇంట్లోనే ఉంటూ సంపాదన అంటూ ఎర 

అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు 

సాక్షి, సిటీబ్యూరో: ‘వేసవి సెలవులు వచ్చాయి..మా పిల్లలకు యోగా నేర్పించాలని అనుకుంటున్నాం’ అంటూ గచ్చిబౌలికి చెందిన ఓ యోగా శిక్షకురాలికి ఫోన్‌ వచ్చింది. సరే అని ఆమె సమయం, ఫీజు తదితర వివరాలు తెలిపింది. అడ్వాన్స్‌ చెల్లిస్తామని శిక్షకురాలి బ్యాంకు ఖాతా, ఆధార్, పాన్‌ కార్డు వివరాలను సైబర్‌ నేరస్తులు తీసుకున్నారు. ఫోన్‌ పే ద్వారా తాము పంపిన లింక్‌కు రూ.10 చెల్లించండి, మీ ఖాతా అని నిర్ధారించుకున్న తర్వాత అడ్వాన్స్‌ పంపిస్తామని కేటుగాళ్లు సూచించారు. నిజమేనని నమ్మిన ఆమె నగదు బదిలీ చేయగానే క్షణాల్లో ఆమె ఖాతాలోని డబ్బు ఖాళీ అయిపోయింది. 
 
లింక్‌లు పంపించి బురిడీ.. 
ఇంట్లోనూ ఉంటూ నెలకు రూ.లక్షల్లో సంపాదించుకోండి’ అంటూ సైబర్‌ నేరస్తులు వల విసురుతున్నారు. నిజమేనని నమ్మి గృహిణులు చేతిలోని సొమ్ము, బ్యాంకు ఖాతాలో ఉన్న నగదునూ పోగొట్టుకుంటున్నారు. మహిళలు ఎక్కువగా ఉద్యోగం, వివాహం, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ వంటి సైబర్‌ మోసాల బారిన పడుతున్నారని, సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్లలో ఈ తరహా కేసులు పెరిగిపోతున్నాయని పోలీసులు చెబుతున్నారు.

నగరంలో జీవన వ్యయం పెరిగింది. భార్యభర్తలిద్దరూ సంపాదిస్తే తప్ప గడవని పరిస్థితి. తమ చదువు, విజ్ఞానానికి అనుగుణంగా గృహిణులు టైలరింగ్, బ్యూటీషియన్, బేకింగ్‌ వంటి ఉపాధి అంశాలను ఎంచుకోవటం సాధారణం. ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరిగాక ఈ రంగాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి.

ట్యూషన్లు, సంగీతం, యోగా, నృత్యం, డిజిటల్‌ ప్రకటనలు, పెట్టుబడులు తదితర అంశాలను నగర మహిళలు ఉపాధిగా మలుచుకుంటున్నారు. ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకూ సంపాదిస్తున్నారు. ఈ వెసులుబాటును సైబర్‌ నేరస్తులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. 
 
నకిలీ వెబ్‌సైట్లతో..  
ప్రముఖ సంస్థల పేర్లతో నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి గృహిణులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. అదనపు సంపాదన కోసం మేమిచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటూ ఆశ చూపిస్తున్నారు. మాయగాళ్ల వలకు చిక్కి రూ.లక్షల్లో పోగొట్టుకుంటున్నారు.

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు వస్తాయని మోసగాళ్ల ప్రకటనను నమ్మిన ఓ యువతి ఒంటి మీద బంగారం అమ్మి మరీ పెట్టుబడి పెట్టడం ఇందుకు ఉదాహరణ. కుటుంబానికి అండగా నిలవాలన్న ఆలోచన మంచిదే కానీ.. ఆన్‌లైన్‌ ద్వారా వచ్చే సందేశాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రకటనలు తేలిగ్గా నమ్మకూడదు. వాటిలో ఎంత వరకు నిజమో నిర్ధారించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు