ఓ ‘క్రిమినల్‌’ స్టోరీ.. విడిపోయిన భార్యభర్తలను కలిపాడు.. చివరికి ఏమైందంటే!

13 May, 2022 07:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాత్కాలికంగా విడిపోయిన భార్యభర్తలు కలవడానికి పరోక్షంగా కారణమైన సైబర్‌ నేరగాడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్‌లోని మొహాలీలో అరెస్టు చేసిన ఇతడిని గురువారం నగరానికి తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు పంపారు. వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో భర్తతో దూరంగా ఉంటూ, విడాకుల ప్రయత్నాల్లో ఉన్న గృహిణికి ఫేస్‌బుక్‌ ద్వారా మొహాలీకి చెందిన పర్మేందర్‌ సింగ్‌తో పరిచయమైంది.

ప్రతి నెలా రూ.2 లక్షల ఆర్జిస్తున్నట్లు చెప్పుకున్న అతగాడు ఆమెతో పెళ్లి ప్రస్తావన చేశాడు. ఆపై నగరానికి రాకపోకలు సాగించి ఆమెతో కొన్ని ఫొటోలు దిగాడు. రెండు సందర్భాల్లో డబ్బు అవసరమంటూ ఆమె నుంచి రూ.70 వేలు తీసుకున్నాడు. ఓ సందర్భంలో అతడిపై అనుమానం రావడంతో ఆమె నేరుగా మొహాలీ వెళ్లారు. పర్మీందర్‌ తండ్రిని కలిసిన నేపథ్యంలో అతడో అవారా అని, గతంలో జైలుకు కూడా వెళ్లివచ్చాడని తేలింది. దీంతో ఆమె పర్మీందర్‌ను దూరంగా ఉంచింది.

దీంతో కక్ష కట్టిన అతగాడు వివాహితతో దిగిన ఫోటోలను ఆమె, ఆమె భర్త, కుమారుడితో పాటు వారి స్నేహితులకూ ఫేస్‌బుక్‌ ద్వారా పంపి దుష్ఫ్రచారం చేశాడు. విషయం తెలిసిన బాధితురాలి భర్త ఆమెకు మళ్లీ దగ్గరై మనోబలాన్నిచ్చాడు. ఇద్దరూ కలిసి సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.  దర్యాప్తు చేసిన అధికారులు మొహాలీలో పర్మీందర్‌ను అరెస్టు చేసి తీసుకువచ్చారు.   
చదవండి: ప్రాణాలు తీసిన డిప్రెషన్‌

మరిన్ని వార్తలు